మమ్మల్ని పని చేసుకోనివ్వండి.. అధికారం కోల్పోయామనే అసహనంలో రోజూ బురద చల్లొద్దు: సీఎం రేవంత్

మమ్మల్ని పని చేసుకోనివ్వండి.. అధికారం కోల్పోయామనే అసహనంలో రోజూ బురద చల్లొద్దు: సీఎం రేవంత్
  • ప్రజలు మాకు ఐదేండ్లపాటు అధికారం కట్టబెట్టారు
  • ఎన్నికలకు ఆరు నెలల ముందే రాజకీయాలుండాలి
  • రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలబెడతామని ముఖ్యమంత్రి ధీమా 
  • ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవం

హైదరాబాద్, వెలుగు: అధికారం కోల్పోయామన్న అసహనం, బాధతో కొందరు ప్రతిరోజూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ప్రజలు తమకు ఐదేండ్లపాటు పరిపాలించేందుకు స్పష్టమైన తీర్పునిచ్చారని, ఆ తీర్పును గౌరవించి కనీసం నాలుగేండ్లయినా తమను ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలన్నారు. 


‘ప్రతిరోజూ రాజకీయాలు చేయకుండా కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలి. ఆఖరి ఆరు నెలల కాలంలో ఏ రాజకీయాలైనా చేసుకుందాం. మీ కడుపులో ఉన్న విషాన్ని ప్రజ లపై కక్కకుండా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి’అని సీఎం సూచించారు. 

గడిచిన కొద్ది నెలల్లోనే విద్య, వైద్య రంగాలలో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. తమ పాలన తీరుకు ఇదే నిదర్శనమని సీఎం చెప్పారు. రాజకీయ విమర్శలను పక్కనబెట్టి ప్రజా ప్రయోజనాలకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌‌‌‌లో ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ ప్లాంట్‌‌ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. 

కేవలం 12 నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ మెగా ప్రాజెక్ట్‌‌ను పూర్తి చేయడం అద్భుతమని కొనియాడారు. అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని పెంచే పద్ధతులకు స్వస్తి పలికి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నగరాన్ని అందిస్తామన్నారు. హైదరాబాద్‌‌లో కాలుష్య నియంత్రణకు సోలార్ ఆక్సిజన్ పంపులను ఏర్పాటు చేస్తామన్నారు. యువతకు నాణ్యమైన శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడంలో పరిశ్రమలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ రహిత తెలంగాణే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

పాత పారిశ్రామిక భూములను మల్టీ-జోన్లుగా మారుస్తాం

క్యూర్​ ప్రాంతంలో దాదాపు కోటి 34 లక్షల మంది జనాభా నివసిస్తున్నారని సీఎం తెలిపారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలన్నింటినీ ఓఆర్ఆర్ అవతలికి తరలిస్తామని సీఎం స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారు. 'క్యూర్' జోన్‌‌లో కేవలం పర్యావరణహిత సేవా రంగానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. 

పాత పారిశ్రామిక భూములను మల్టీ-జోన్లుగా మార్చి, నివాస యోగ్యంగా తీర్చిదుద్దుతామని వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళన ద్వారా నగర రూపురేఖలను పూర్తిగా మార్చబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల నివాసానికి హైదరాబాద్ అత్యంత అనుకూల నగరంగా నిలుస్తుంది. రేర్​ పరిధిలో సుమారు 10 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ జోన్‌‌ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌‌గా మారుస్తారు.

 సీతారాంపూర్‌‌లో ఏర్పాటైన ప్రీమియర్ ఎనర్జీస్ ప్లాంట్ దీనికి ఒక ఉదాహరణగా నిలిచిందనిచ పర్యావరణానికి హాని చేయని అధునాతన ఉత్పాదక పరిశ్రమలను ఇక్కడే నెలకొల్పుతామని సీఎం ప్రకటించారు. చైనాలోని గ్వాంగ్‌‌డాంగ్ ప్రావిన్స్ తరహాలో క్రమశిక్షణతో కూడిన అభివృద్ధిని సాధిస్తామన్నారు. స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. 

పారిశ్రామికాభివృద్ధికి రవాణా సౌకర్యాలే ముఖ్యం 

పారిశ్రామికాభివృద్ధికి రవాణా సౌకర్యాలు అత్యంత కీలకమని సీఎం చెప్పారు. కొడంగల్​ నుంచి ఆమన్ గల్ వరకు 52 కిలోమీటర్ల మేర రేడియల్ రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు100 మీటర్ల వెడల్పుతో రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు. 2028 జూలై నాటికి ఈ ప్రతిష్టాత్మక రేడియల్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఈ రోడ్డు పూర్తయితే విమానాశ్రయం నుంచి సీతారాంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి దూరం 36 కిలోమీటర్లకు తగ్గుతుందన్నారు. అత్యంత వేగవంతమైన కనెక్టివిటీ ద్వారా ఈ ప్రాంతంలో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఉదారంగా నష్టపరిహారం అందించి, ఆదుకుంటామన్నారు. చేవెళ్ల శాసనసభ్యుడు యాదయ్య కోరిన అభివృద్ధి పనులన్నింటినీ నెరవేరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. 

చేవెళ్ల ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని ప్రకటించారు. అలాగే సీతారాంపూర్ భూనిర్వాసితులకు ఇళ్ల పట్టాలతో పాటు వాణిజ్య కేంద్రాలు నిర్మిస్తామన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల నుంచి హైదరాబాద్ పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఢిల్లీలో కాలుష్యం వల్ల పార్లమెంట్‌‌కు, పాఠశాలలకు సెలవులు ఇచ్చే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ముంబైలో భారీ వర్షాలతో, బెంగళూరులో ట్రాఫిక్ వల్ల ప్రజలు నరకం చూస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి ఇబ్బందులు హైదరాబాద్ నగరానికి రాకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళికలు వేస్తున్నామన్నారు. త్వరలోనే సీతారాంపూర్ దేవాలయ ప్రారంభోత్సవానికి స్వయంగా వచ్చి నిర్వాసితులందరినీ కలుస్తానన్నారు.

డిగ్రీలు కాదు.. నైపుణ్యాలు కావాలి
కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు ఉంటే సరిపోదని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసమే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐలను అధునాతన టెక్నాలజీ కేంద్రాలుగా (ఏటీసీ) అప్‌‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. 

పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన సాంకేతిక కోర్సులను ప్రవేశపెట్టి యువతను నిపుణులుగా తీర్చిదుద్దుతామన్నారు. పరిశ్రమలకు కావాల్సిన సెమీ-స్కిల్డ్, స్కిల్డ్ మానవ వనరులను ఇక్కడి నుంచే అందిస్తామని చెప్పారు. బ్లూ కాలర్ ఉద్యోగాల సృష్టి ద్వారా గ్రామీణ యువత ఆర్థికంగా స్థిరపడేలా చేస్తున్నామన్నారు. వైట్ కాలర్ ఉద్యోగాల కొరత ఉన్న ప్రస్తుత తరుణంలో సాంకేతిక నైపుణ్యాలే శ్రీరామరక్ష అన్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ వంటి సంస్థలు స్థానిక నిపుణుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.