ఛీ.. నువ్వు అసలు బిడ్డవేనా..! ఆస్తి, ఉద్యోగం కోసం సుపారీ ఇచ్చి తల్లిని చంపించిన బిడ్డ

ఛీ.. నువ్వు అసలు బిడ్డవేనా..! ఆస్తి, ఉద్యోగం కోసం సుపారీ ఇచ్చి తల్లిని చంపించిన బిడ్డ

జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం సుపారీ ఇచ్చి కన్నతల్లినే ఓ కూతురు హత్య చేయించింది. జైపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆయుషి శర్మ (23) తన తల్లి నీరజ్ శర్మ (45)ను హత్య చేయించేందుకు తన బాబాయ్, బావమరిదితో కలిసి స్కెచ్ వేసింది. రూ.7 లక్షల సుపారీ ఇచ్చి, కాంట్రాక్ట్ కిల్లర్ల సహాయంతో స్కార్పియోతో ఈ నెల 3న యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌ చేయించింది. ఈ ఘటనకు సంబంధించి  ఆయుషి శర్మతో పాటు ఆమె బాబాయ్ మోహన్ స్వరూప్, మోహిత్ శర్మ, ఆకాష్ శర్మ, అరవింద్ శర్మ, హేమంత్ శర్మ, రోహిత్ జాతవ్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఆయుషి బావమరిది బలరామ్ పరారీలో ఉన్నాడు. నీరజ్‌‌‌‌‌‌‌‌ శర్మ భర్త ఏడాది క్రితం మరణించడంతో కారుణ్య నియామకం కింద ఆయన ఉద్యోగం భార్య నీరజ్‌‌‌‌‌‌‌‌ శర్మకు వచ్చింది. అయితే, ఆ ఉద్యోగం తనకు రావాలని ఆయుషి ఆశపడింది. ఆస్తి విషయంలోనూ తల్లితో ఆయుషికి వివాదాలు ఉన్నాయి. దీంతో తల్లిని అడ్డుతొలగించుకుంటే ఆస్తితో పాటు స్థానిక కోర్టులో లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌ క్లర్క్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగం తనకు వస్తుందని హత్య చేయించింది. నీరజ్ శర్మ సోదరుడు రాకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా, అసలు విషయం బయటపడింది.