సైబర్ సమరం.. విదేశీ ముప్పుల వలయంలో భారత్

సైబర్ సమరం.. విదేశీ ముప్పుల వలయంలో భారత్

ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక విభేదాలు ఇక కేవలం దౌత్యం లేదా సైనిక చర్యలకే పరిమితం కావడం లేదు. సైబర్ రంగం కూడా యుద్ధభూమిగా మారింది. ప్రభుత్వాలు, సిద్ధాంతపరమైన సంస్థలు, రహస్య  గ్రూపులు తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాలపై సైబర్ దాడులు నిర్వహిస్తూ కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ర్యాన్సమ్‌‌వేర్, మాల్వేర్,  డేటా చౌర్యం, గూఢచర్యం వంటి పద్ధతుల ద్వారా ఆయా దేశాల భద్రతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సవాళ్లను భారత్ కూడా తీవ్రంగా ఎదుర్కొంటోంది. 

ఆర్థిక, సాంకేతిక, డిజిటల్ రంగాల్లో వేగంగా ఎదుగుతున్న భారతదేశం సైబర్  నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారింది. ముఖ్యంగా సమాచార, సాంకేతికం, పరిశ్రమలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఔషధ రంగాలపై దాడులు పెరుగుతున్నాయి. ఈ దాడుల వెనుక పాకిస్థాన్,  చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలకు చెందిన హ్యాకింగ్ ముఠాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా సైబర్ నేరగాళ్ల నుంచి కూడా ముప్పు ఎదురవుతోంది. 

దేశ ఆర్థిక స్థిరత్వంపై సైబర్ దాడుల ప్రభావం

భారత ఆర్థికవ్యవస్థకు కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌‌ఎంఈలు) ఇటీవలి కాలంలో ఎక్కువగా సైబర్ దాడులకు గురవుతున్నాయి.  పరిమిత వనరులు, సాంకేతిక భద్రతలో లోపాల కారణంగా అవి ఈ దాడులను  సమర్థంగా ఎదుర్కోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో  దేశ ఆర్థిక స్థిరత్వంపై కూడా ప్రభావం పడుతోంది.  ప్రపంచ వేదికపై భారత్ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యర్థి శక్తులు కంప్యూటర్లు, స్మార్ట్​ఫోన్లు,  నెట్‌‌వర్క్​లపై మాల్వేర్  దాడులను ముమ్మరం చేస్తున్నాయి. 

వాటిలో ట్రోజన్ మాల్వేర్ దాడులు అత్యధికంగా నమోదవుతున్నాయి. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ విడుదల చేసిన 2024 నివేదిక ప్రకారం మొత్తం మాల్వేర్ దాడుల్లో  ట్రోజన్ వాటా  సుమారు 43 శాతం ఉంది.  అనంతరం ఇన్‌‌ఫెక్టర్లు, వార్మ్స్ వంటి  మాల్వేర్ రకాలు చోటు దక్కించుకున్నాయి.  గత ఏడాది రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే తెలంగాణ  అత్యధిక మాల్వేర్ దాడులను ఎదుర్కొంది. ఆ తర్వాత తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి.  నగరాల పరంగా సూరత్ మొదటి స్థానంలో ఉండగా, బెంగళూరు, హైదరాబాద్ తదుపరి స్థానాల్లో నిలిచాయి.

ఆర్థిక సంస్థలే లక్ష్యంగా..

ఇండోనేషియాకు చెందిన హ్యాకింగ్ గ్రూపులు, అలాగే బంగ్లాదేశ్‌‌కు చెందిన హ్యాక్టివిస్ట్ సంస్థల నుంచి కూడా భారత్‌‌పై సైబర్ దాడులు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్–హమాస్, ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణల అనంతరం రాజకీయ ఉద్దేశాలతో జరిగే సైబర్ దాడుల సంఖ్య కూడా అధికమైంది.  పాకిస్థాన్‌‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ అనంతరం సైబర్ రంగంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. భారత ప్రభుత్వ వెబ్‌‌సైట్ల రూపురేఖలను మార్చే ప్రయత్నాలు, మాల్వేర్ చొప్పించే దాడులు అధికమయ్యాయి. 

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత కీలక మౌలిక వసతులు, ఆర్థిక సంస్థలు లక్ష్యంగా మారే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరించాయి.  ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్‌‌పై లక్షల సంఖ్యలో సైబర్ దాడి ప్రయత్నాలు  నమోదయ్యాయి. వాటిలో కొన్నింటిలో హ్యాకర్లు నెట్‌‌వర్క్‌‌ల్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు.  రక్షణ సంస్థలను లక్ష్యంగా చేసుకుని కొన్ని హ్యాకింగ్ గ్రూపులు మాల్వేర్ దాడులు జరిపేందుకు యత్నించినట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. 

పాకిస్థాన్‌‌కు చైనా సాంకేతిక సహకారం

చైనా పరోక్షంగా పాకిస్థాన్‌‌కు సాంకేతిక సహకారం అందిస్తూ సైబర్ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు కథనాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా భారత్‌‌పై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడం కూడా ఈ వ్యూహంలో భాగంగా  కనిపిస్తోంది. హమాస్‌‌కు మద్దతుగా ఉన్న కొన్ని హ్యాక్టివిస్ట్ గ్రూపులు కూడా భారత్‌‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు, బ్యాంకింగ్ రంగాలపై డీడీవోఎస్ దాడులు, డేటా చౌర్యం,  తప్పుడు  సమాచార ప్రచారం వంటి చర్యలకు  పాల్పడుతున్నాయి. భారత ప్రభుత్వ సంస్థలు,  ప్రభుత్వరంగ సంస్థలు,  ప్రైవేటు కంపెనీల నుంచి కీలక సమాచారాన్ని సేకరించేందుకు పదేపదే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాల్దీవుల్లో ‘ఇండియా అవుట్’ ప్రచారం ద్వారా  భారత వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించడం,  ప్రాంతీయ రాజకీయాల్లో సైబర్ ప్రచారాన్ని వినియోగించడం కూడా గమనార్హం. 

జాతీయ భద్రతలో అంతర్భాగంగా సైబర్ భద్రతను పరిగణించాలి

బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల్లో భవిష్యత్తులో కూడా ఇలాంటి సైబర్ ప్రభావం పెరిగే అవకాశాలను నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్  వంటి సంస్థల ద్వారా రక్షణ చర్యలను  మరింత బలోపేతం చేస్తోంది. డిజిటల్ ఆర్థికవ్యవస్థను కాపాడుకోవాలంటే సైబర్ భద్రతను జాతీయ భద్రతలో అంతర్భాగంగా పరిగణించాలి.  ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునిక సైబర్ రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి.  నైపుణ్యం కలిగిన సైబర్  భద్రతా నిపుణులను తీర్చిదిద్దడంతోపాటు పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి.  బహుముఖ వ్యూహంతో ముందుకు సాగినప్పుడే దేశం సైబర్ ముప్పులను సమర్థంగా ఎదుర్కోగలదు.

- హరిప్రసాద్ దూపాటి
సోషల్​ఎనలిస్ట్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.