నాగర్ కర్నూల్, వెలుగు : జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కేవలం తాగునీటికే సరిపోతాయని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) కాల్వల ద్వారా సాగునీటి సరఫరా సాధ్యం కాదని నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. నీటి లభ్యత, సాగు పురోగతిపై గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సాగునీటి సరఫరాపై రైతులకు ఎటువంటి అపోహలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా వివరించాలని ఆదేశించారు. నీటి ఎద్దడి దృష్ట్యా ఎక్కువ నీళ్లు అవసరమయ్యే పంటలకు బదులుగా జొన్న, సజ్జ, మొక్కజొన్న, కంది, మినుము వంటి ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని సూచించారు.
మండలానికి అనువైన పంటల జాబితాను తెలుగులో రూపొందించి రైతు వేదికలు, వాట్సప్ గ్రూపుల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచాలని, ఈ నెల 14లోగా మండలాల వారీ ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో యూరియా కొరత లేదని తెలిపారు.
