Goodbye Gautam Gambhir: టీ20 ప్రపంచకప్ 2026 గెలిచినప్పుడు నీరాజనాలు పట్టిన నోళ్లే.. ఇప్పుడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో భారత్ చతికిలపడటాన్ని చూసి నోరెళ్లబెడుతున్నాయి. టాస్ గెలవడంలో వంద శాతం సక్సెస్ రేట్ ఉన్నప్పటికీ, మ్యాచ్‌లు గెలవడంలో మాత్రం జీరో ప్రదర్శన చూసి బీసీసీఐ పెద్దల మైండ్ బ్లాక్ అయింది. ఫలితంగా, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చెత్త వ్యూహాలకు అర్ధరాత్రి వేళ బోర్డు చెక్ పెట్టేసినట్లు గట్టిగా వినిపిస్తోంది. ప్రయోగాల పేరుతో సీనియర్లను బెంచ్‌కే పరిమితం చేసి, కుర్రాళ్లతో జట్టుని ముందుకు నడపాలని చూసిన గంభీర్ ప్లాన్ కాస్తా రివర్స్ కావడంతో, ఆయనకు ఉద్వాసన పలకడమే తరువాయి అని టాక్ నడుస్తోంది.
బోర్డుకు పుట్టిన జ్ఞానోదయం:
గంభీర్ సార్ చేసిన ప్రయోగాలు ఎంత దారుణంగా దెబ్బకొట్టాయంటే, కనీసం పసికూన ఐర్లాండ్ జట్టుపై కూడా గెలవలేనంతగా టీమ్ ను బలహీనంగా మార్చేశాడు. టాస్ గెలిచి రికార్డులు సృష్టిస్తున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు, మ్యాచ్‌లు ఎలా గెలవాలో చెప్పడంలో కోచ్ ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అనుభవం ఉన్న ప్లేయర్స్ ని పక్కనబెట్టి, కేవలం ఫామ్‌లో లేని కుర్రాళ్లను నమ్ముకోవడంతో ఇంగ్లాండ్ సిరీస్ చేజారిందని బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
కొత్త కోచ్ రేసులో లెజెండ్స్:
గౌతమ్ గంభీర్ సీటు ఖాళీ అవుతుండటంతో, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ముగ్గురు విదేశీ దిగ్గజాల పేర్లు తెరపైకి వచ్చాయి. మనోళ్లు ఎలాగూ దారికి రావడం లేదని, ఈసారి కాస్త కఠినమైన విదేశీ కోచ్‌లను తెచ్చేందుకు బీసీసీఐ స్కెచ్ వేసింది.
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా): రెండు వరల్డ్ కప్‌లు గెలిపించిన మాజీ కెప్టెన్ పేరు రేసులో అందరికంటే ముందుంది. ఐపీఎల్‌లో ఢిల్లీ, పంజాబ్ జట్లను ఎలా ఆడించాడో చూశాం కాబట్టి.. ఇబ్బందుల్లో ఉన్న టీమిండియాను కూడా అలాగే గాడిన పెడతాడని బీసీసీఐ ఆశిస్తుంది.
* స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్): చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయాల వెనుక ఉన్న అసలు సూత్రధారి.. ఆటగాళ్లను ప్రశాంతంగా ఉంచుతూనే వారిలోని ప్రతిభను రాబట్టడం ఇతని స్పెషాలిటీ.
* జస్టిన్ లాంగర్ (ఆస్ట్రేలియా): డిసిప్లిన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. గెలుపు కోసం ప్రతి ఒక్కరికి నరనరాల్లో నూరిపోయడానికి ఇతనే కరెక్ట్ అని కొందరు సభ్యులు బీసీసీఐకి సూచిస్తున్నారు.
