యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లులో భారీ అక్రమాలు.. రూ.18 కోట్ల ధాన్యం దారి మళ్లింపు

యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లులో భారీ అక్రమాలు.. రూ.18 కోట్ల ధాన్యం దారి మళ్లింపు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని శివపార్‌ బాయిల్డ్ రైస్ మిల్లుపై సివిల్ సప్లై అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు మిల్లు, అలాగే మోటకొండూరు, భువనగిరి, ముత్తిరెడ్డిగూడెం ప్రాంతాల్లోని సంబంధిత గోదాంలలో ధాన్యం నిల్వలు, రికార్డులను అధికారులు సమగ్రంగా పరిశీలించారు.

ఈ తనిఖీల్లో 2025-26 వానాకాలం సీజన్‌కు సంబంధించిన సి.ఎం.ఆర్. ధాన్యంలో భారీ అక్రమాలు బయటపడ్డాయి. సుమారు 6,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ సుమారు 18 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.

ఈ రైస్ మిల్లు రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్‌కు చెందినదని గమనార్హం. ప్రభుత్వానికి జరిగిన ఖచ్చితమైన నష్టం ఎంత అన్నదానిపై అధికారులు తదుపరి విచారణ చేపట్టనున్నారు. తుది నివేదికలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారులు ఈ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.