భారత క్రికెట్ జట్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సుమారు నాలుగేళ్లకు పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar India comeback) అద్భుత రీఎంట్రీ ఇచ్చారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి ప్రారంభంకానున్న న్యూజిలాండ్ టీ20 టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో భువీకి చోటు దక్కింది. అయితే, చీఫ్ సెలక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ (Ajit Agarkar BCCI) తప్పుకోవడం వల్లే భువనేశ్వర్ రీఎంట్రీ సులువైనట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కొత్త సెలెక్టర్ల నిర్ణయం:
జూలై 2023లో అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, సీనియర్ ప్లేయర్స్ ని పక్కనపెట్టి భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లతో ముందుకు వెళ్లాలనే విధానాన్ని అనుసరించారు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత భువనేశ్వర్ ను కూడా సెలెక్టర్లు పక్కనపెట్టారు. అప్పుడు పరిస్థితి ఏంటో నాకు తెలుసు, అందుకే దాన్ని మనసారా అంగీకరించానని భువీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే, అగార్కర్ పదవీకాలం ముగిసిన తర్వాత.. తాత్కాలిక చీఫ్ సెలక్టర్ ప్రజ్ఞాన్ ఓజా నేతృత్వంలో తొలి జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో భువీ జట్టులోకి మళ్లీ పిలుపునిచ్చారు.
ఐపీఎల్‌లో అదరగొట్టిన భువీ:
టీమిండియాలో చోటు కోల్పోయినప్పటికీ, ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ తన ప్రదర్శనతో అదరగొట్టాడు. 2023 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధికంగా 72 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా భువీ నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున గత రెండు సీజన్లలో అద్భుతంగా రాణించి 30 మ్యాచ్‌లలో 45 వికెట్లు తీసి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2026 సీజన్‌లో కేవలం ఒక వికెట్ తేడాతో పర్పుల్ క్యాప్ కోల్పోయిన భువీ, ఏకంగా 28 వికెట్లు పడగొట్టి పవర్‌ప్లేలో తన స్వింగ్, సీమ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు.
న్యూజిలాండ్ టూర్ షెడ్యూల్:
ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్‌లో రెస్ట్ ఇవ్వడంతో, భువనేశ్వర్ కుమార్ అనుభవం భారత్‌కు ఎంతో ప్లస్ కానుంది. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ లాంటి యువ పేసర్లను 2028 ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధం చేయడంలో భువీ మార్గదర్శకత్వం కీలకం కానుంది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 మధ్య న్యూజిలాండ్‌తో భారత్ 5 టీ20ల సిరీస్ ఆడనుంది. తొలి రెండు టీడీఐలు క్రైస్ట్‌చర్చ్ (అక్టోబర్ 22, 24), మూడోది వెల్లింగ్టన్ (అక్టోబర్ 27), ఆ తర్వాత ఆక్లాండ్ (అక్టోబర్ 30), హమిల్టన్ (నవంబర్ 1) వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20ల తర్వాత ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు టెస్టుల సిరీస్ కూడా జరగనున్నాయి.
