China Cricket: ఒలింపిక్స్‌లో క్రికెట్ పునఃప్రవేశం నేపథ్యంలో చైనాలో ఈ క్రీడను మరింత విస్తరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చర్యలు చేపడుతోంది. చైనాలో క్రికెట్ పట్ల పెరుగుతున్న ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ ప్రణాళికలు రచిస్తోంది. దీంతో చైనా క్రికెట్ అసోసియేషన్ (CCA) ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో పాటు త్వరలోనే 'టైర్ 2' ఈవెంట్‌ను నిర్వహించేందుకు సాయం చేస్తామని ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా (Sanjog Gupta) వెల్లడించారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్:
* సంజోగ్ గుప్తా మాట్లాడుతూ.. చైనాలో క్రికెట్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. యూఏఈలోని ఐసీసీ అకాడమీ తరహాలోనే చైనాలో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయడానికి సీసీఏ (CCA)తో కలిసి పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. చైనాలో మౌలిక వసతులను మెరుగుపరచడంలో భాగంగా, సమీప భవిష్యత్తులో ఐసీసీ 'టైర్ 2' ఈవెంట్‌ను అక్కడ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించాడు.
ఒలింపిక్స్, నేషనల్ గేమ్స్ ఎఫెక్ట్:
* 128 సంవత్సరాల తర్వాత లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ (LA28) లో క్రికెట్ పునఃప్రవేశం జరగనుండటం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు కొత్త ఊపు తెస్తోందని ఐసీసీ అభిప్రాయపడుతుంది.
* చైనాలోని 22 ప్రావిన్సుల్లో ప్రస్తుతం 9 చోట్ల క్రికెట్ ఉనికిలో ఉంది. ఆసియా క్రీడలు (హాంగ్‌జౌ 2022) విజయవంతం తర్వాత, చైనా నేషనల్ గేమ్స్‌లోనూ క్రికెట్‌కు చోటు కల్పిస్తే అక్కడ ఈ క్రీడ మరింత వేగంగా విస్తరిస్తుందని ప్లాన్ రెడీ చేస్తోంది. ప్రభుత్వాల నుంచి పెట్టుబడులు, మౌలిక వసతులు పెరగడానికి ఒలింపిక్ చేరిక ఎంతగానో దోహదపడుతుందని చెప్పుకొచ్చింది.
మహిళా క్రికెట్‌కు పెద్దపీట:
* చైనాలో మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు సీసీఏ (CCA) అద్భుతమైన విధానాన్ని అవలంబిస్తోందని ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా ప్రశంసించారు. అన్ని కార్యక్రమాలలోనూ 50 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండేలా చైనా పాలసీ రూపొందించుకుందని తెలిపారు.
* చైనా వేదికగా ఇటీవల 1500 మంది సామర్థ్యం గల క్రికెట్ స్టేడియం ప్రారంభమైంది.
* టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను మాండరిన్ (Mandarin) భాషలో లైవ్ స్ట్రీమింగ్ చేయడం వలన చైనాలో విశేష స్పందన లభించిందని, చివరి వారంలోనే 4.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయని ఆయన వెల్లడించారు. గత ఐదేళ్లలో ఐసీసీ నుంచి సీసీఏకు 1.5 మిలియన్ డాలర్లకు పైగా నిధులు సమకూర్చడం విశేషం.
