Mittapalli Surender: ఎన్ని డబ్బులిచ్చినా 'ఐటమ్ సాంగ్స్' రాయను.. లిరిసిస్ట్ మిట్టపల్లి ఇలా ఎందుకన్నారంటే?

Mittapalli Surender: ఎన్ని డబ్బులిచ్చినా 'ఐటమ్ సాంగ్స్' రాయను.. లిరిసిస్ట్ మిట్టపల్లి ఇలా ఎందుకన్నారంటే?

తెలంగాణ జానపదాలు, ఉద్యమ గీతాలే కాక  సినిమా పాటల్లోనూ తనదైన ప్రత్యేకత చాటుతున్నారు మిట్టపల్లి సురేందర్‌‌‌‌. ‘జార్జిరెడ్డి’లో వాడు నడిపే బండి రాయల్ ఎన్‌‌ఫీల్డ్.. ‘లవ్ స్టోరీ'లోని  నీ చిత్రం చూసి, 'రాజు వెడ్స్ రాంబాయి'చిత్రంలోని పాటలతో ఆకట్టుకున్న మిట్టపల్లి సురేందర్‌‌‌‌.. తాజాగా ‘మారెమ్మ’ చిత్రంలో నాలుగు పాటలకు సాహిత్యం అందించారు.

రవితేజ సోదరుడు రఘు కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని  మంచాల నాగరాజు దర్శకత్వం వహించగా, మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా  మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ ‘ఈ  కథ అంతా విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లోనే సాగుతుంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి పాటకు లిరిక్స్ రాశాను. ఇందులోని పాటలు మనసుకు హత్తుకుంటాయి. ఇటీవల విడుదలైన ‘మారి’ పాటకు మంచి ఆదరణ దక్కుతోంది. ‘మారి’ అనేది సినిమాలో హీరో ఆడుకునే దూడ పేరు. ఒక దూడ చుట్టూ ఎమోషన్, రిలేషన్‌‌ను ప్రజెంట్ చేస్తూ పాట రాశాను. ఇలాంటి పాట రాసే అవకాశం రావడం అదృష్టం.

కథ చదివినప్పుడు ఎలాంటి ఎమోషన్  ఫీల్ అయ్యానో, అదే ఎమోషన్ స్క్రీన్‌‌పైకి వచ్చింది. నేను ఏ పాట రాసినా కుటుంబం మొత్తం కలిసి వినేలా ఉండాలి. అలాంటి పాటలే రాయాలని ఇష్టపడతాను. కమర్షియల్ ఏవైనా రాస్తాను కానీ ఐటమ్స్ సాంగ్స్‌‌, డబుల్ మీనింగ్ సాంగ్స్‌‌ జీవితంలో రాయను. ఈ ఐటెం సాంగ్స్ రాయననే మొండితనం వల్ల ఒక సినిమాకు సింగిల్ కార్డ్ (సినిమాలోని అన్ని పాటలు రాసే అవకాశం) క్రెడిట్ కూడా కోల్పోయాను. అయినా సరే నా నిర్ణయం మార్చుకోను.

నేను రాసే పాట నా తల్లి, కూతురు, సోదరి కలిసి వినేలా ఉండాలి. ‘పెద్ది’ సినిమాలో రెండు పాటలు రాశా. జగపతి బాబు పాత్ర చనిపోయినప్పుడు, క్లైమాక్స్‌‌లో వచ్చే పాటలవి. ప్రస్తుతం దాదాపు పది సినిమాలకు పాటలు రాస్తున్నా’ అని చెప్పారు.