భవిష్యత్తు హైడ్రోజన్ ఇంధనానిదే.. దేశంలోని 10 రూట్లలో ట్రైల్స్ షురూ: నితిన్ గడ్కరీ

భవిష్యత్తు హైడ్రోజన్ ఇంధనానిదే.. దేశంలోని 10 రూట్లలో ట్రైల్స్ షురూ: నితిన్ గడ్కరీ

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి భవిష్యత్ ఇంధనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రోజన్‌ ఫ్యూయల్ రవాణా రంగ భవిష్యత్తును పూర్తిగా మార్చగల ఇంధనంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 ప్రధాన రవాణా మార్గాల్లో హైడ్రోజన్ ఇంధన ట్రయల్స్ కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఇంధన వాడకాన్ని పెంచి, కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు క్రూడ్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని గడ్కరీ చెప్పారు.

ప్రస్తుతం గ్రేటర్ నోయిడా-ఢిల్లీ-ఆగ్రా, భువనేశ్వర్-కోణార్క్-పురీ, అహ్మదాబాద్-వడోదరా-సూరత్, పూణే-ముంబై, తిరువనంతపురం-కొచ్చి, విశాఖపట్నం-బయ్యవరం సహా మొత్తం 10 కీలక మార్గాల్లో హైడ్రోజన్ ఇంధన వాహనాల పరీక్షలు కొనసాగుతున్నాయని గడ్కరీ చెప్పారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే రాబోయే రోజుల్లో హైడ్రోజన్ తో నడిచే బస్సులు, ట్రక్కులు, ఇతర వాణిజ్య వాహనాల వినియోగం మరింత వేగంగా పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

"హైడ్రోజన్‌నే ఫ్యూయల్ ఆఫ్ ది ఫ్యూచర్" అని గడ్కరీ స్పష్టం చేస్తూ.. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా బయోఫ్యూయల్స్, ప్రత్యామ్నాయ ఇంధనాల అభివృద్ధిపై వేగంగా పనిచేస్తోందన్నారు. ప్రపంచ స్థాయి సాంకేతికత, భద్రత, ప్రయాణికుల సౌకర్యాలను అందించే వాహనాలను తయారు చేయాలని ఆటో దిగ్గజ సంస్థలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అదే సమయంలో ఉత్పత్తి వ్యయం కూడా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు, 1.8 లక్షల మరణాలు జరుగుతున్నాయని గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి ప్రమాదాల వల్ల దేశ జీడీపీలో దాదాపు 3 శాతం మేర ఆర్థిక నష్టం జరుగుతోందన్నారు. మరోవైపు దేశానికి సంవత్సరానికి 3 లక్షల బస్సులు అవసరమవుతుండగా ప్రస్తుతం కేవలం 70 వేల నుంచి 80 వేల బస్సులే తయారవుతున్నారు. హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వంటి గ్రీన్ ఇంధనాలపై దృష్టి పెంచుతూ ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడింతలు పెంచాల్సిన టైం వచ్చేసిందని గడ్కరీ స్పష్టం చేశారు.