దేశంలోని ప్రముఖ గోల్డ్ రీటైరల్ చైన్ కల్యాణ్ జ్యువెలర్స్ షేర్ ఒక్కసారిగా పెరిగిపోవటం ఇన్వెస్టర్ల దృష్టిని మళ్లీ గోల్డ్ రిటైల్ రంగంపైకి ఆకర్షించింది. వరుసగా 3 ట్రేడింగ్ సెషన్లలో 30 శాతానికి పైగా లాభపడిన ఈ షేర్ మార్కెట్లో హాట్ టాపిక్ అయ్యింది. గతంలో కంపెనీ క్వార్టర్లీ బిజినెస్ అప్‌డేట్ అంచనాలకు కొంత తక్కువగా ఉండటంతో షేర్‌పై ఒత్తిడి కనిపించినా.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సిటీ మరోసారి "బై" రేటింగ్ కొనసాగిస్తూ రూ.750 టార్గెట్ ప్రకటించటంతో మార్కెట్లో నమ్మకం పెరిగింది. దీంతో దీర్ఘకాల వృద్ధిపై నమ్మకంతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగుతున్నారు.
పెట్టుబడిదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం కంపెనీ విస్తరణ ప్లాన్. దేశవ్యాప్తంగా కొత్త షోరూమ్‌లను ప్రారంభిస్తూ మార్కెట్ వాటాను పెంచుకోవడం, ఫ్రాంచైజీ మోడల్ ద్వారా తక్కువ పెట్టుబడితో వేగంగా విస్తరించడం కంపెనీకి ప్రధాన బలంగా మారింది. ఇదే సమయంలో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో లాభదాయకత మరింత పెరుగుతుందనే అంచనాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
►ALSO READ | మళ్లీ పెరిగిపోతున్న బంగారం, వెండి.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన రేట్లివే..
జూన్ త్రైమాసికంలో భారత మార్కెట్లో కంపెనీ 38 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. సేమ్ స్టోర్ల నుంచి వచ్చిన అమ్మకాలు 28 శాతం పెరగడం వినియోగదారుల డిమాండ్ ఎంత బలంగా ఉందో సూచిస్తోంది. అంతర్జాతీయ వ్యాపారం కూడా సుమారు 35 శాతం వృద్ధి నమోదు చేయగా, వెస్ట్ ఆసియా కార్యకలాపాలు 30 శాతం పెరిగాయి. మొత్తం ఆదాయంలో విదేశీ మార్కెట్ల వాటా 14 శాతానికి చేరుకోవడం కంపెనీకి విభిన్న ఆదాయ వనరులు ఉన్నాయని చూపిస్తోంది.
ఇక డిజిటల్ జ్యువెలరీ బ్రాండ్ క్యాండెరే అత్యంత వేగంగా గ్రో అవుతున్న విభాగంగా నిలిచింది. ఈ విభాగం ఆదాయం ఏకంగా 112 శాతం పెరగడం మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో 12 కొత్త కల్యాణ్ షోరూమ్‌లు, 5 క్యాండెరే స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం నెట్‌వర్క్ 524 అవుట్‌లెట్లకు చేరుకుంది. రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో సేల్స్ ఇంకా బలపడతాయని మార్కెట్ అంచనా వేస్తోంది. అందుకే ప్రస్తుతం చాలామంది పెట్టుబడిదారులు గోల్డ్ స్టాక్స్‌పై మళ్లీ ఆసక్తి చూపేలా చేస్తోంది.
