బోడిగుండుకు.. మోకాలికి ముడి పెట్టడం అంటే ఇదేనేమో. చేయి నొప్పికి.. గర్భసంచికి ముడి పెట్టి కాసుల కక్కుర్తితో ఓ నిండు ప్రాణం తీశాడు ఓ మూర్ఖపు వైద్యుడు. హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న షాద్ నగర్ లో జరిగింది ఈ విషాద ఘటన. కుటుంబ సభ్యుల ఆందోళనతో విషయం బయటకు పొక్కడంతో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ దారుణం వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్ క్రిస్టియన్ కాలనీకి చెందిన సుజాత అనే మహిళ తన చెయ్యి నొప్పి అని టౌన్ లోని చంద్రశేఖర్ హాస్పిటల్ లో చికిత్స కోసం వెళ్లింది. వైద్యులు ఆమెకు పలు రకాల స్కానింగ్ లు చేసి గర్భసంచి సమస్య ఉందని, వెంటనే దాన్ని తొలగించాలని చెప్పడంతో బాధితురాలు ఆపరేషన్ కు ఒప్పుకుంది.
ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఆమె కోమలోకి వెళ్ళింది. అది తప్పించుకోవడానికి హాస్పిటల్ వైద్యులు హైదరాబాద్ పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తీసుకెళ్లగా అక్కడ కొన ఊపిరితో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
హైదరాబాద్ నుండి షాద్ నగర్ కు భౌతికకాయాన్ని తీసుకొచ్చి చంద్రశేఖర్ ఆసుపత్రి ముందు ధర్నా చేసే అవకాశం ఉందనే సమాచారం తో ముందస్తు చర్యగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అంబులెన్స్ ను ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు చంద్రశేఖర్ ప్రైవేట్ ఆస్పత్రి ముందు రెండు చోట్లా ఆందోళనకు దిగారు.
