వలస కార్మికుల పిల్లల వద్దకే అంగన్వాడీ వాహనం ..ఈ వెహికల్ ద్వారా పోషకాహారం, హెల్త్ చెకప్స్

వలస కార్మికుల పిల్లల వద్దకే అంగన్వాడీ వాహనం ..ఈ వెహికల్ ద్వారా  పోషకాహారం, హెల్త్ చెకప్స్
  • ఎంసీఆర్​హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీలో జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు వివేక్, సీతక్క
  • ఏ ఒక్క చిన్నారి అంగన్వాడీ సేవకు దూరం కావొద్దు: మంత్రి సీతక్క

‘మొబైల్ అంగన్​వాడీ’ వాహనాన్ని మంగళవారం హైదరాబాద్​లో మంత్రులు వివేక్, సీతక్క ప్రారంభించారు. కార్మిక శాఖ సహకారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఈ వెహికల్.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సేవలందించనుంది. ఈ సందర్భంగా వివేక్​ మాట్లాడుతూ.. కార్మికుల పిల్లల వద్దకే వెళ్లి పోషకాహారం, చెకప్స్, ప్రీ-స్కూల్ విద్య అందించడం అభినందనీయమని అన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని వాహనాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.  

హైదరాబాద్, వెలుగు:వలస కార్మికుల పిల్లలకూ విద్య, పోషకాహారం అందాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కార్మికుల సంక్షేమం అంటే కేవలం ఉపాధి, వేతనాలే కాదని.. వారి కుటుంబాలు, పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లోని ఎంసీఆర్ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ‘మొబైల్ అంగన్వాడీ’ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. 

కార్మిక శాఖ సహకారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఈ వెహికల్.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలో సేవలందించనుంది. ఈ సందర్భంగా మంత్రి వివేక్​ మాట్లాడుతూ.. మహిళా, శిశు సంక్షేమ శాఖతో కలిసి కార్మిక శాఖ ఇలాంటి ప్రజాప్రయోజన కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. వలస కార్మికులు తరచూ ప్రాంతాలు మారుతుంటారని, దానివల్ల వారి పిల్లల చదువు, ఆరోగ్యం దెబ్బతింటోందని వెల్లడించారు. 

‘‘మొబైల్ అంగన్వాడీ అనేది మంత్రి సీతక్క ఆలోచన చేసిన గొప్ప కార్యక్రమం. కార్మికుల పిల్లల వద్దకే నేరుగా వెళ్లి పోషకాహారం, చెకప్స్, ప్రీ-స్కూల్ విద్య అందించడం అభినందనీయం. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని వాహనాలను అందుబాటులోకి తెస్తాం’’ అని వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. 

దేశ భవిష్యత్తు చిన్నారుల చేతుల్లోనే: మంత్రి సీతక్క

దేశ భవిష్యత్తు చిన్నారుల చేతుల్లోనే ఉందని, ఏ ఒక్క చిన్నారి కూడా అంగన్వాడీ సేవలకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ విజన్​–2047 లక్ష్య సాధనలో నేటి చిన్నారులే కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ‘‘సాధారణంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకే పోషకాహారం, విద్య అందుతాయి. కానీ, పొట్టకూటి కోసం నగరాలకు వలస వచ్చే కార్మికుల పిల్లలు ఈ సేవలకు దూరమవుతున్నారు.

అలాంటి వారి కోసమే ఈ మొబైల్ అంగన్వాడీలను తీసుకొచ్చాం’’ అని తెలిపారు. ఒక్కో మొబైల్ వాహనం దాదాపు 10 అంగన్వాడీ కేంద్రాలతో సమానమని, దీని ద్వారా సుమారు 300 మందికి లబ్ధి చేకూరుతుందని వివరించారు.  ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రుతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి, మేడ్చల్ డీడబ్ల్యూఓ శారదతో పాటు కార్మిక, శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జులై 8న  ‘ముఖాముఖి’లో పాల్గొననున్న మంత్రి వివేక్

పీసీసీ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న  మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఉపాధి, కార్మిక కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించనున్నారు. సమస్యను బట్టి సంబంధిత అధికారులతో మంత్రి  మాట్లాడి వాటిని పరిష్కరించనున్నారు. కాబట్టి ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో తీసుకురావాలని గాంధీ భవన్ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.