IND vs ENG: బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో భారత జట్టుని చిత్తు చేసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లీష్ టీమ్ 3–0తో కైవసం చేసుకుంది. ఫలితంగా 12 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ చేతిలో ఇండియా టీ20 సిరీస్ కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ కి ఇది వరుసగా రెండో సిరీస్ ఓటమి.. ఈ ఘోర పరాజయం అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ జట్టు ప్రదర్శనపై తీవ్రంగా మండిపడ్డాడు.
ప్రణాళికల అమలులో వైఫల్యం:
మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. తాము చేసిన 158 పరుగుల స్కోర్ ఏ మాత్రం సరిపోదని తెలుసు.. కానీ నేను ఒక్కడినే ఆడితే టీమ్ గెలవదు కాదా.. బ్యాటింగ్ చేసే సమయంలో అనవసరమైన షాట్స్ ఆడి వికెట్ పారేసుకుంటున్నారు.. ఒక్కో రన్ తీసి క్రీజులో కుదురుకున్న తర్వాత దూకుడుగా ఆడితే బాగుంటుందన్నాడు. ఇక ఈ పిచ్‌పై మిడిల్, లెగ్ స్టంప్ లైన్లలో వచ్చే బంతులను ఆడటం కష్టం, కాబట్టి ఒకే లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలని మా బౌలర్లకు చెప్పాను.. కానీ మేం ఆ వ్యూహాన్ని గ్రౌండ్ లో సరిగ్గా అమలు చేయలేకపోయాం.. మా బౌలర్లు పేస్ మార్చడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఇంగ్లాండ్ బ్యాటర్లు బౌండరీలతో విరుచుకుపడ్డారని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
జట్టు ప్రస్తుతం ట్రాన్సిషన్ ఫేస్‌లో:
వరుస ఓటములపై వస్తున్న విమర్శలకు శ్రేయస్ అయ్యర్ సమాధానం ఇస్తూ.. జట్టు ప్రస్తుతం మార్పు దశ (Transition Phase)లో ఉందన్నాడు. జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్లు తొలిసారి ఇంగ్లాండ్ కండిషన్స్‌లో ఆడుతున్నారు, విదేశీ పరిస్థితులకు ఎలా అలవాటు పడాలో తెలుసుకునేందుకు ఈ తప్పులు ఉపయోగపడతాయన్నాడు. కాగా, నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా, జట్టు విజయానికి ఉపయోగపడనప్పుడు ఆ ఇన్నింగ్స్‌కు విలువ ఉండదని చెప్పుకొచ్చాడు.
బ్రూక్, సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్:
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 రన్స్ చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (80 నాటౌట్) మినహా మిగతా బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లీష్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కేవలం 13.5 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి టార్గెట్ ని చేధించింది.
