IND vs ENG: భారత టీ20 జట్టు కష్టాలు కొనసాగాయి. బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో టీమిండియాను ఘోరంగా ఓడించింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లీష్ టీమ్ 3–0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఇండియా తాత్కాలిక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఇది వరుసగా రెండో సిరీస్ పరాభవం.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతను ఇప్పటి వరకు ఒక్క టీ20 మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయాడు.
8 ఏళ్ల రికార్డు బద్దలు:
రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న ద్వైపాక్షిక (Bilateral) టీ20 సిరీస్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ సిరీస్ గెలవడం చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఆరు సిరీస్‌లలో ఐదింటిని భారత్ గెలవగా, ఒకటి డ్రా అయింది. అంతేకాకుండా, గత 8 ఏళ్లలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లాండ్ చేతిలో భారత్‌కు ఇదే మొదటి సిరీస్ ఓటమి. చివరిసారిగా 2018 టూర్‌లో భారత్ వన్డే సిరీస్‌ను 2–1తో, టెస్ట్ సిరీస్‌ను 4–1తో కోల్పోయింది. ఆ తర్వాత ఆడిన 10 ద్వైపాక్షిక సిరీస్‌లలో 8 గెలిచి, 2 డ్రా చేసుకుని ఇండియన్ టీమ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
బ్రూక్, సాల్ట్ విధ్వంసం.. తేలిపోయిన భారత్ బౌలింగ్:
భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ బ్యాటర్లు ఊదేసారు. కేవలం 13.5 ఓవర్లలోనే ఒకే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ని ఛేదించారు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఓపెనర్ ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సాల్ట్ 42 బంతుల్లో 59 రన్స్ చేయగా, కెప్టెన్ బ్రూక్ కేవలం 35 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 79 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ అయ్యర్:
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 158/7 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్కడే 49 బంతుల్లో 80 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును ఆదుకున్నాడు. అయితే అతనికి అవతలి ఎండ్ నుంచి ఎవరి మద్దతు లభించలేదు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి నిరాశపరిచి 10 బంతుల్లో 15 పరుగులకే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, జోష్ టంగ్ చెరో రెండు వికెట్లు తీసి భారత పరుగుల వేగాన్ని కట్టడి చేశారు.
ఆఖరి మ్యాచ్‌లోనైనా పరువు దక్కేనా?:
సిరీస్ ఇప్పటికే ఇంగ్లాండ్ వశం కావడంతో, చివరిదైన ఐదో టీ20 మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు, క్లీన్ స్వీప్‌తో సిరీస్‌ను ఘనంగా ముగించాలని ఇంగ్లీష్ జట్టు పట్టుదలగా ఉంది. కానీ మరోవైపు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ప్రపంచ ఛాంపియన్లుగా యూరప్ పర్యటనకు వెళ్లిన భారత్.. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐర్లాండ్ పర్యటనలో 0–2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా, ఇప్పుడు ఇంగ్లాండ్‌లోనూ అదే పేలవ ప్రదర్శనను పునరావృతం చేసింది. వరుసగా రెండు ద్వైపాక్షిక సిరీస్‌లను చేజార్చుకోవడం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
