వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు.. మెదక్ జిల్లా జడ్జిమెంట్

వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు.. మెదక్ జిల్లా జడ్జిమెంట్

​మెదక్​ టౌన్​, వెలుగు :  మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాదులూరు గ్రామంలోని దత్తాత్రేయ ఆశ్రమంలో ఒంటరిగా నివసిస్తున్న అంజమ్మ (75) ను బంగారు గుండ్ల కోసం గొంతు నులిమి హత్య చేసిన నిందితుడు శివకుమార్‌‌కు జీవిత ఖైదుతో పాటు రూ.6 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చారని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. 

2024 ఆగస్టు 7న అంజమ్మకు భోజనం ఇచ్చేందుకు వచ్చిన ఆమె మేనల్లుడు రాములు గుడిసెలో ఆమె మృతదేహాన్ని గుర్తించగా, అక్కడే దాక్కున్న నిందితుడు శివకుమార్ ఆయనపై దాడికి యత్నించి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐలు రాజశేఖర్ రెడ్డి, రేణుక రెడ్డి   విచారణ జరిపి సమగ్ర ఆధారాలను కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో కోర్టు ఈ మేరకు శిక్షను ఖరారు చేసిందని ఎస్పీ తెలిపారు.