దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు.. ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ

దేవాదాయ శాఖలో  భారీగా బదిలీలు.. ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ

యాదగిరిగుట్ట, వెలుగు: ‘వైటీడీ బోర్డు’ ప్రమాణ స్వీకారానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. గతంలో బదిలీలపై వెళ్లిన యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర ఆలయాల ఉద్యోగులను తిరిగి యథా స్థానాలకు బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్, ఐఏఎస్ అధికారి హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ నిర్ణయంతో గతంలో యాదగిరిగుట్ట నుంచి ఇతర ఆలయాలకు వెళ్లిన 23 మంది ఉద్యోగులు తిరిగి ఇక్కడకు రానుండగా, ఇతర దేవస్థానాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు తిరిగి తమ సొంత ఆలయాలకు వెళ్ల నున్నారు. యాదగిరిగుట్ట ఆలయ పరిపాలనా విభాగాన్ని బలోపేతం చేయడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, భక్తులకు సమర్థవంతంగా సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ఈ బదిలీలు నిర్వహించారు. 

గతంలో జరిగిన ట్రాన్స్‌‌ఫర్ల వల్ల అనుభవజ్ఞులైన అధికారులు మారడంతో పాలనలో తలెత్తిన సమస్యల దృష్ట్యా, పాత ఉద్యోగులను తిరిగి యాదగిరిగుట్టకు తీసుకురావాలని ఆలయ ఈవో భవానీ శంకర్ మార్చి 7న ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా స్పందించిన ప్రభుత్వం దేవాదాయ శాఖను ఆదేశించడంతో ఈ ఉత్తర్వులు వెలువడినట్లు తెలుస్తోంది. అయితే పాలకమండలి ప్రమాణ స్వీకారానికి ముందురోజే ఈ బదిలీలు జరగడం విశేషం.