- సూర్యాపేట జిల్లాలో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
- జగిత్యాల జిల్లాలో భర్తను కొట్టి చంపిన భార్య
- గద్వాల జిల్లాలో యువకుడిని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
తుంగతుర్తి/కోరుట్ల/గద్వాల, వెలుగు : రాష్ట్రంలోని పలు జిల్లాలో గురువారం ముగ్గురు హత్యకు గురయ్యారు. సూర్యాపేట జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసిన అనంతరం తానుకూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తికి చెందిన కోట సత్యనారాయణ (66), కనకలక్ష్మి (63) భార్యాభర్తలు. వీరు అల్లంవెల్లుల్లి అమ్ముతూ జీవిస్తున్నారు.
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సైతం భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన సత్యనారాయణ తన భార్య కనకలక్ష్మిని హత్య చేశాడు. అనంతరం తనకున్న ఆస్తిని తన ఇద్దరు కుమారులు సమానంగా పంచుకోవాలని, ఇద్దరూ గొడవలు పడొద్దని సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకున్నాడు. గురువారం ఉదయం చుట్టుపక్కల ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా... ఇద్దరూ చనిపోయి కనిపించారు.
కోరుట్లలో భార్య చేతిలో భర్త...
కోరుట్ల, వెలుగు : కుటుంబ గొడవలతో ఓ మహిళ రోకలిబండతో కొట్టి తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. కోరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట బేడ బుడగ జంగం కాలనీకి చెందిన ఇప్ప కాశీరాం (35)కు అదే కాలనీకి చెందిన రజనితో 14 ఏండ్ల కింద వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. దంపలిద్దరూ కూలి పనులకు వెళ్తూ జీవిస్తున్నారు.
కాశీరాం రోజూ మద్యం తాగి వచ్చి రజనితో గొడవ పడి కొట్టేవాడు. ఈ క్రమంలో రజని 20 రోజుల కింద కాశీరాంపై కర్రతో దాడి చేసింది. గమనించిన బంధువులు హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్ మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం మధ్యాహ్నం బంధువులు పోచమ్మ తల్లి వన భోజనాలు చేసుకోగా.. భార్యాభర్తలిద్దరూ మద్యం సేవించి రాత్రి ఇంటికి వచ్చారు. తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కాశీరాం ఇంటి ముందున్న రేకుల షెడ్డులో పడుకున్నాడు.
అర్ధరాత్రి సమయంలో రజని రోకలిబండతో కాశీరాంపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై చిరంజీవి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించి రజనిని అరెస్ట్ చేశారు.
ఉలిగేపల్లిలో యువకుడి హత్య
గద్వాల, వెలుగు : పొలం వద్ద పడుకున్న ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఉలిగేపల్లిలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బోయ గోవిందమ్మ గోవిందుల కుమారుడు బోయ మహేశ్ (24) బుధవారం రాత్రి గ్రామ శివారులోని పొలం వద్ద ఉన్న గుడిసెలో పడుకున్నాడు.
గురువారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు వెళ్లి చూసే సరికే రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే గద్వాల ప్రభుత్వ హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. సమచారం అందుకున్న గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, మల్దకల్ ఎస్ఐ శ్రీహరి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి ఆధారాలు సేకరించారు.
