వేల కోట్లు గాయబ్.. కాగ్ నివేదికలో వేల కోట్లకు లెక్కలు చూపని మోడీ సర్కార్

వేల కోట్లు గాయబ్.. కాగ్ నివేదికలో వేల కోట్లకు లెక్కలు చూపని మోడీ సర్కార్

ఏ పాలకవర్గ పార్టీ అయినా, ప్రభుత్వం అయినా.. అవినీతి, అవకతవకలకు అతీతంకాదని తాజాగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రుజువు చేసింది. అవినీతిని రూపుమాపి స్వచ్ఛమైన పాలన అందించడమే ధ్యేయం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన ఉన్న ఎన్‌‌డీఏ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గత పాలక ప్రభుత్వాల ప్రకటన మాదిరిగానే మోదీ ప్రభుత్వం కూడా  కేవలం మాటలకే పరిమితం అయ్యింది. అవినీతిని అంతం చేస్తానంటూనే మోదీ సర్కార్​వేల కోట్లకు లెక్కలు చెప్పలేదు. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌‌ (కాగ్) నివేదిక మోదీ ప్రభుత్వం చేసిన  నిధుల మళ్లింపులను బట్టబయలు చేసింది.

మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భారీగా లెక్కలు తప్పాయని, నిధుల మళ్లింపు  జరిగినట్లు కాగ్​స్పష్టంగా తెలియజేసింది. 2025కు  సంబంధించిన  కాగ్ నివేదికను 2026 ఏప్రిల్‌‌లో  పార్లమెంట్‌‌లో ప్రవేశపెట్టారు. 15 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలోని 33,873 పెండింగ్  వినియోగ  ధృవీకరణ పత్రాల ఆధారంగా  కేంద్ర ప్రభుత్వ అవకతవకలను కాగ్ తన నివేదికలో పేర్కొంది. 

సంక్షేమ పథకాల్లో భారీగా ఆర్థిక అవకతవకలు

మోదీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల నిధులను దుర్వినియోగం చేయడంతోపాటు భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆ నివేదికలో పేర్కొంది. రహదారులు, సంక్షేమ పథకాల్లో జరిగిన అవకతవకలను కాగ్ నివేదికలు తప్పుపట్టాయి. 54,282 కోట్ల రూపాయలకు లెక్క లేని వ్యయంపై   ప్రభుత్వ మౌనం అనేక అనుమానాలకు కారణంగా ఉంది. కార్పొరేట్ల నుంచి 74 వేల కోట్ల రూపాయల ఆదాయపు పన్ను వసూలు కాలేదని, విదేశాంగ మంత్రిత్వశాఖ వద్ద 50 కోట్ల రూపాయలకు వివరాలు లేవని నివేదిక తెలిపింది. 

 కాగ్  గుర్తించినవి ఈ విధంగా ఉన్నాయి.  గృహ రంగానికి సంబంధించిన రూ.18,273 కోట్లు,  ఉన్నత విద్య కింద రూ. 14,360 కోట్లు, ఇతర మంత్రిత్వ శాఖల పరిధిలో రూ.21,649 మిగిలిన బ్యాలెన్సులుగా ఉన్నాయి. భారత్​మాల పరియోజన రోడ్ ప్రాజెక్టులో భారీగా ఖర్చులు పెరిగాయని, తప్పుడు బిడ్డింగ్‌‌ల పద్ధతులు అనుసరించారని, టెండర్లలో అవకతవకలు జరిగాయని కాగ్ పేర్కొంది. 

 మరణించినవారికి చికిత్సల పేరుతో నిధులు విడుదల

ఢిల్లీలోని ద్వారకా ఎక్స్​ప్రెస్​నిర్మాణ వ్యయం కిలోమీటరుకు 18 కోట్ల రూపాయలకు బదులుగా ఏకంగా 250 కోట్ల రూపాయలకు పెరగడంపై  కాగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  ఆయుష్మాన్ భారత్  ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన  పథకంలో అర్హులుకానివారికి లబ్ధి చేకూరిందని కాగ్​పేర్కొంది. మరణించినవారికి చికిత్సల పేరుతో నిధులు విడుదల అయ్యాయని కాగ్  నివేదిక వెల్లడించింది.  

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు  ప్రాథమిక సహాయం అందించడానికి ఉద్దేశించిన జాతీయ సామాజిక కార్యక్రమం నుంచి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆరు రాష్ట్రాల్లోని ఇతర ప్రాజెక్టులకు 57.45 వేల కోట్ల రూపాయలను మళ్లించిందని కాగ్ నివేదిక  వెల్లడించింది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని( ఉడ్ దేశ్ కా ఆమ్ నాగ్రిక్) ‘ఉడాన్’ ప్రాంతీయ అనుసంధానం పథకం వంటి ప్రభుత్వ ప్రాజెక్టుల్లో,  భారత్‌‌మాల పరియోజన ఫేజ్ 1కు సంబంధించి కిలోమీటరు రోడ్డు నిర్మాణ వ్యయం రూ. 15 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయలకు పెరిగిందని,  కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కూడా అవకతవకలు జరిగినట్లు మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి.          

కాగ్ నివేదికపై మోదీ ప్రభుత్వం స్పందించాలి

నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ఖర్చు చేసిన నిధుల వినియోగ పత్రాలను సమర్పించడం తప్పనిసరి. జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ ప్రకారం నిధులు ఖర్చు చేసిన 12 నెలల్లో  దానికి సంబంధించిన ధృవపత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. 54 వేల కోట్ల రూపాయల నిధుల ఖర్చు వివరాలు పదేపదే అడిగినా, పథకాల పేర్లు తప్ప ఎటువంటి పత్రాలను అధికారులు ఇవ్వలేదని, అనేక ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని కాగ్ పేర్కొంది. గృహనిర్మాణ శాఖ, ఉన్నత విద్యాశాఖ, కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి ధృవపత్రాలు అందాల్సి ఉందని నివేదిక పేర్కొంది. 

ఆయుష్మాన్ భారత్ పథకంలో 80 వేల మందికి ఒకే ఫోన్ నంబర్ నమోదు చేయడాన్ని కాగ్ ఎత్తి చూపింది. కాగ్ నివేదికపై వివరణ ఇవ్వని ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, అవకతవకలను బయటపెట్టిన కాగ్ అధికారుల బదిలీకి మాత్రం సిద్ధమైంది. మోదీ ప్రభుత్వ  కక్షసాధింపు చర్యలపై విమర్శలు ప్రారంభమైనాయి. నిజాయితీగల అధికారులపై అది కక్షసాధింపు చర్యగా అనేక పార్టీలు అభివర్ణించాయి. అవినీతి రహిత  పారదర్శక పాలన,  ప్రజలకు జవాబుదారీతనం గురించి నిత్యం మాట్లాడే మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం  కాగ్ నివేదికపై స్పందించి మాట్లాడుతుందా..?  

- బొల్లిముంత సాంబశివరావు

ఓపెన్​పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.