అవినీతికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు కేవలం ఆరోపణలకే పరిమితం కావడం లేదు. అవి కోట్ల రూపాయలు, కిలోలకొద్దీ బంగారం, ఎకరాలకొద్దీ భూముల రూపంలో ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న అవినీతి నిరోధక దాడుల్లో కట్టలకొద్దీ నగదు, బంగారం, ఇతర అక్రమాస్తుల గుట్టలు బయటపడుతున్నాయి. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అందరి బండారం ఈ దాడుల్లో బట్టబయలవుతోంది. తెలంగాణలో ఓ డీఎస్పీ ఇంటి స్థావరాలపై జరిగిన దాడుల్లో కిలోలకొద్దీ బంగారం, వెండితోపాటు ఖరీదైన విల్లాలు, భూములు వెలుగుచూశాయి.
కర్నాటకలో ఎక్సైజ్ అధికారుల వద్ద లంచాల పంపిణీకి సంబంధించిన లెడ్జర్ పుస్తకంతోపాటు రూ.5.5 కోట్ల నగదు, రూ.7.8 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. ఒడిశాలో ఒక మెడికల్ ఇన్‌స్టిట్యూట్ అధికారులపై జరిగిన దాడుల్లో రూ.2 కోట్ల నగదు, 32 భూముల పత్రాలు లభ్యమయ్యాయి. ఈ ధనదాహం కేవలం ఉన్నతాధికారులకే పరిమితం కాలేదు. ఏపీలో ఒక ఆఫీస్ అటెండర్ ఇంట్లో 760 గ్రాముల బంగారం, 8 కిలోల వెండి, అనేక ఇళ్లు, స్థలాల పత్రాలు దొరకడం అవినీతి వికృతికి అద్దం పడుతోంది. ంతులేని అత్యాశలో దేవుళ్లను కూడా వదలకపోవడాన్ని చూసి యావత్ దేశం ఇప్పుడు దిగ్భ్రాంతికి గురవుతోంది.
భారతదేశంలో అవినీతి అనేది పెద్దగా నష్ట భయంలేని, అత్యధిక లాభాలు తెచ్చిపెట్టే వ్యవహారంగా మారిపోయింది. కానీ చైనాలో పరిస్థితి వేరు. ఇటీవల చైనాలోని ఒక న్యాయస్థానం యాంగ్ యూలిన్ అనే మాజీ నగర అధికారికి ఏకంగా మరణశిక్ష విధించింది. ఇంజినీరింగ్ కాంట్రాక్టులు ఇప్పించడానికి లంచాలు తీసుకున్నట్లుగా రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. గతేడాది, 'బ్యాంక్ ఆఫ్ చైనా' మాజీ ఛైర్మన్ లియు లియాంగేపై అక్రమ రుణాల జారీ ఆరోపణలు రుజువు కావడంతో జినాన్ నగర కోర్టు ఆయన ఆస్తులన్నీ జప్తుచేసి ‘వాయిదా వేయగల మరణశిక్ష’ విధించింది.
దీని ప్రకారం, కోర్టు మరణశిక్ష విధించి రెండేళ్లపాటు ఆపుతుంది. ఆ వ్యవధిలో దోషి సత్ప్రవర్తనతో ఉంటే దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తారు. కానీ మళ్లీ ఏదైనా నేరం చేస్తే ఉరి తీస్తారు. ఈ స్థాయి శిక్షలు భారత దేశంలో ఊహించలేకపోయినా - ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాలను ఏర్పాటుచేసి విచారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1977లో కాన్పూర్‌కు చెందిన ఒక భూ వివాదంలో రూ.300 లంచం తీసుకున్న ఒక రెవెన్యూ అధికారికి 1985లో ట్రయల్ కోర్టు విధించిన ఏడాది కఠిన కారాగార శిక్షను అలహాబాద్ హైకోర్టు 2026లో సమర్థిస్తూ కోర్టుముందు లొంగిపోవాలని ఆదేశించింది. అవినీతి కేసులలో న్యాయ ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటం నిందితులకే అనుకూలంగా మారింది.
ప్రాణాలకు తెగించి గిగ్ డెలివరీలు చేస్తున్న యువత
అవినీతి వల్ల అత్యంత తీవ్రంగా నష్టపోయేది పేదలే. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రూపొందించిన 182 దేశాల అవినీతి సూచికలో భారత్ 91వ స్థానంలో ఉంది. 308 మంది డాలర్ బిలియనీర్లతో అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉన్న దేశంలో - పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం పిల్లలు నీరసిస్తూ ఎదురుచూసే దైన్యం ఉంది. అవినీతి సృష్టిస్తున్న వైరుధ్యాలు అడుగడుగునా కనిపిస్తాయి.
ఒకవైపు విదేశీయులకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న దేశంలోనే.. పల్లెల్లో గర్భిణులను ఇప్పటికీ డోలీల్లో మోసుకుంటూ సుదూర ఆసుపత్రులకు తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కోట్ల టర్నోవర్లు సాధిస్తున్న ఈ-కామర్స్ దిగ్గజాలు ఒకవైపు.. కనీస సామాజిక భద్రత, రక్షణ లేకుండా రాత్రివేళల్లో సైతం ప్రాణాలకు తెగించి గిగ్ డెలివరీలు చేస్తున్న యువత మరోవైపు ఉన్నారు. బ్యాంకులకు ఎగవేసిన బడా కార్పొరేట్ సంస్థల రుణాలను ఏటా లక్షల కోట్లలో రద్దు చేస్తున్న వ్యవస్థలోనే.. మధ్యతరగతి తమ అవసరాల కోసం ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న విషాదం నెలకొంది.
నిజాయితీగల ఉద్యోగుల కోసం‘విజిల్ బ్లోయర్ల రక్షణ చట్టం 2014’
ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా ప్రకారం, అవినీతి వల్ల వర్ధమాన దేశాలకు ఏటా సుమారు రూ.106 లక్షల కోట్ల నష్టం జరుగుతోంది. ఈ సంపదతో - ఆఫ్రికా, ఆసియాలోని అన్ని వర్ధమాన దేశాల్లో - ప్రతి గ్రామానికి తాగునీరు, ఆధునిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాణ్యమైన పాఠశాల విద్యా వసతులను నిర్మించవచ్చు. ఈ చీకట్లను పారదోలేందుకు తీసుకువచ్చిన చిరుదీపం సమాచార హక్కు చట్టం ఆశించిన విజయం సాధించలేకపోయింది. తెరవెనుక జరిగే అవినీతిని సామాన్య ప్రజలు ముందే పసిగట్టలేరు.
ప్రజాధనం లూటీ అయ్యాక, తీవ్ర నష్టం వాటిల్లిన తర్వాత మాత్రమే ఆ అవినీతి వ్యవహారం సామాన్యులకు తెలుస్తోంది. అవినీతిని మొగ్గలోనే తుంచేయాలంటే, నిజాయితీపరులైన ఉద్యోగులే ధైర్యంగా ముందుకు వచ్చి అవినీతిని బట్టబయలు చేయాలి. అలా తమ సొంత కార్యాలయాల్లోని అవినీతిని ఎత్తిచూపే ఉద్యోగుల కోసం ఉద్దేశించినదే విజిల్ బ్లోయర్ల రక్షణ చట్టం 2014.. అవినీతిని వెలికితీసే నిజాయితీపరులకు రక్షణ కల్పించడమేగాక, అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కీలకమైన ఈ చట్టాన్ని తక్షణం పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకురావాలి.
అధికారుల వార్షిక ఆస్తుల నివేదిక తప్పనిసరి చేయాలి
ప్రాణాలకు సైతం తెగించి విధి నిర్వహణ చేసే నిజాయితీపరులైన అధికారులు ఎందరో ఉన్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బొగ్గు లారీ కిందపడి ప్రాణాలు కోల్పోయిన భూపాలపల్లి రవాణా శాఖ అధికారి వెంకన్న, నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్ల వాహనాలను తనిఖీ చేసే క్రమంలో డ్రైవర్ కారుతో చేసిన దాడిలో గాయాలపాలై, మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య వంటి నిబద్ధతగల ఉద్యోగుల త్యాగాలు, కొంతమంది ఉద్యోగుల అవినీతితో మరుగునపడుతున్నాయి.
పారదర్శకతను మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులందరి వార్షిక ఆస్తుల నివేదికలను తప్పనిసరిగా అంతర్జాలంలో అందుబాటులో ఉంచాలి. ఇందువల్ల అక్రమాస్తులపై ప్రజల నిఘా పెరిగి అవినీతికి కళ్లెం పడుతుంది. నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ దేశాల్లో పొరుగింటి వారి ఆదాయపు పన్ను చెల్లింపు సమాచారం ఆన్‌లైన్‌లో ఉన్నట్లే, అమెరికాలో ప్రభుత్వ ఖర్చులన్నీ బహిర్గతం చేసినట్లే మనమూ అమలు చేయాలి.
సామాన్యులకు అడ్డంకిగా మారుతున్న ఆంగ్ల భాషపాలనా భాషగా ఆంగ్లం కూడా అవినీతికి పరోక్షంగా కారణమవుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలు, అధికారిక సమాచార మార్పిడి అంతా ఆంగ్ల భాషలో ఉండటం వల్ల సామాన్య పౌరులు వాటిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ భాషా అంతరాన్ని ఆసరాగా చేసుకొని దళారులు సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించి లంచాలు దండుకుంటున్నారు. పాలన పారదర్శకంగా ఉండాలంటే, అది సామాన్యులకు అర్థమయ్యే భాషలో ఉండాలి. కాబట్టి, ప్రభుత్వ పాలన, అధికారిక వ్యవహారాలన్నీ తప్పనిసరిగా ప్రజల భాషలోనే జరగాలి.
అవినీతిపై పోరాటం చేయాలంటే నేపాల్‌ను చూసి నేర్చుకోవాలి
అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేవలం లంచం తీసుకోవడమే కాదు, లంచం ఇవ్వడం కూడా నేరమే. 2018లో ఈ చట్టానికి చేసిన సవరణల ద్వారా చేర్చిన సెక్షన్ 7ఎ ప్రకారం ఎవరైనా ప్రభుత్వ అధికారికి లంచం ఇస్తే, ఇచ్చే వ్యక్తికి కూడా ఏడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అయితే, గత్యంతరం లేక లంచం ఇవ్వాల్సి వస్తే ఆ విషయాన్ని 7 రోజుల్లోగా ఫిర్యాదు చేస్తేనే రక్షణ లభిస్తుంది.
ఈ చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలి. పొరుగున ఉన్న నేపాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఒక మేలుకొలుపు. మన దేశంతో పోలిస్తే నేపాల్‌లో అవినీతి స్థాయి తక్కువే అయినప్పటికీ అక్కడి జెన్ జీ తరం యువత దానిని ఏమాత్రం సహించలేదు. వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా వారు ఏకమై వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. అవినీతిని కేవలం చట్టాలు, కోర్టులు మాత్రమే నిర్మూలించలేవు. అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోకుండా, పౌరులు ప్రశ్నించడం మొదలుపెట్టాలి.
- శ్రీనివాస్ మాధవ్
సమాచార హక్కు పరిశోధకుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
