స్లోగా యంగ్ ఇండియా స్కూల్‌‌ పనులు.. ఫండ్స్ ఉన్నా పనుల్లో పురోగతి లేదు.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే జాప్యం

స్లోగా యంగ్ ఇండియా స్కూల్‌‌ పనులు.. ఫండ్స్ ఉన్నా పనుల్లో పురోగతి లేదు.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే జాప్యం
  • భద్రాద్రి జిల్లాలో 5 నియోజకవర్గాల్లో స్కూళ్ల ఏర్పాటుకు నిర్ణయం
  • కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాల్లో స్లోగా పనులు
  • నెలలు గడుస్తున్నా.. ఇల్లెందులో ఇంకా స్థలం వెతుకులాటలోనే

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్​ఇండియా ఇంటిగ్రేటెడ్​స్కూల్స్​ నిర్మాణ పనులు జిల్లాలో స్లోగా సాగుతున్నాయి. జిల్లాలోని కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మాణ పనులు స్లోగా సాగుతుండగా.. ఇల్లెందులో ఇంకా స్థలం ఫైనల్‌‌ కాలేదు. నెలలు గడుస్తున్నా స్థలం వెతుకులాటలోనే అధికారులు ఉన్నారు. 

ఫండ్స్ ఉన్నా పనుల్లో పురోగతి లేదు.. 

అధునాతన సౌకర్యాలు, హై క్వాలిటీతో ఎడ్యుకేషన్​ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి యంగ్​ఇండియా ఇంటిగ్రేటెడ్​స్కూల్‌‌ను గతేడాది శాంక్షన్‌‌ చేసింది. ఒక్కో స్కూల్‌‌కు దాదాపు రూ. 200కోట్లు నిధులు కేటాయించింది. ఒక్కో స్కూల్​ నిర్మాణానికి దాదాపు 20 నుంచి 25 ఎకరాల ల్యాండ్‌‌ను కేటాయించారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాలకు యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​స్కూళ్లను శాంక్షన్ చేసింది. 

కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో నిర్మాణ పనులు మొదలుకాగా.. ఇల్లెందులో మాత్రం ఇంకా స్థలం వెతుకులాటలోనే ఆఫీసర్లు ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లను స్టార్ట్​ చేయాలనే ఆలోచనకు అధికారులు, కాంట్రాక్టర్లు గండి కొడ్తున్నారు. నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ పనులేమో స్లోగా సాగుతున్నాయి.

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పనుల్లో జాప్యం

2027 జులై నాటికి స్కూల్స్​నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. పనులు మొదలై దాదాపు ఆర్నెళ్లు కావొస్తున్నా ఇప్పటివరకు కొత్తగూడెంలో కేవలం 5శాతం, అశ్వారావుపేటలో ఒక్క శాతం, భద్రాచలంలో 15శాతం, పినపాకలో 10శాతం వరకు మాత్రమే పనులు జరిగాయి.  ఉన్నతాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడం వల్లే కాంట్రాక్టర్లు స్లోగా పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

 కొత్తగూడెంలో స్కూల్​నిర్మాణ పనులను ఇటీవల పరిశీలించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు స్పీడ్‌‌గా చేపట్టాలంటూ ఆఫీసర్లతో పాటు కాంట్రాక్టర్లను ఆదేశించారు.