కాగజ్ నగర్, వెలుగు: తునికి(బీడీ) ఆకు కూలీ డబ్బులు తెంపిన వారికి కాకుండా వేరే వ్యక్తులకు చెల్లించిన అధికారులు తప్పును సరిదిద్దుకున్నారు. అర్హులకు తిరిగి చెల్లించారు. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కర్జెల్లి బీట్ లోని బూరుగుడాలో బీడీ ఆకు కల్లాల్లో అక్రమాలు జరిగాయని 13 మంది గిరిజన రైతులు ఆరోపించారు. తాము సేకరించిన బీడీ ఆకు కట్టలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా, మరికొందరి పేర్లపై నమోదు చేసి డబ్బులను మళ్లించారని జిల్లా అటవీశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు.
అటవీశాఖ రికార్డుల్లో ఇద్దరి ఖాతాల్లో ఈ నగదు జమ అయినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు రావాల్సిన డబ్బులు అందజేయాలని ఉన్నతాధికారులను కోరారు. దీంతో స్పందించిన అటవీశాఖ అధికారులు గురువారం గూడెం గ్రామంలో అసలు కూలీలకు డబ్బులు పంపిణీ చేశారు. ఈ విషయమై అటవీ అధికారులను సంప్రదించగా టెక్నికల్ ఇష్యూతో డబ్బులు ఇతరుల ఖాతాల్లోకి మళ్లాయని, తిరిగి అర్హులకు అందజేసినట్లు చెప్పారు.
