ములుగు, వెలుగు: గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, ప్రణాళికాబద్ధమైన పాలనతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్రం అని అన్నారు.
గురువారం ములుగులో 171 జీపీల సర్పంచులు, కార్యదర్శులకు పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, పంచాయతీరాజ్ చట్టం, 16వ ఆర్థిక సంఘం నిధులు తదితర అంశాలపై ట్రైనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు గ్రామ పాలన, చట్టాలు, విధివిధానాలు, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, నిధుల వినియోగం, గ్రామ పంచాయతీ స్థిరమైన యాక్షన్ ప్లాన్ అమలు, ఆర్థిక నిర్వహణ, పారదర్శక పాలనపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు.
పంచాయతీల సొంత ఆదాయాన్ని పెంపొందించేందుకు పన్నులు, ఫీజుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్సంపత్రావు, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి సురేశ్‌బాబు.. సర్పంచులు, కార్యదర్శులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, వైస్ చైర్‌పర్సన్ సారంగం, డీపీవో వెంకయ్య, పీఆర్ ఈఈ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
భూపాలపల్లి రూరల్, వెలుగు: గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో చిట్యాల, కొత్తపల్లి గోరి, రేగొండ, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు, ప్రజలకు ఉపయోగపడే ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, పాల్గొన్నారు.
భద్రాచలం, వెలుగు: గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు సర్పంచులకు పిలుపునిచ్చారు. భద్రాచలంలో పంచాయతీల అభివృద్ధిపై సర్పంచులకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, శానిటేషన్, విద్య, వైద్యం, రోడ్లు, ఉపాధి కల్పన వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని ప్రణాళికలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో నాగలక్ష్మీ సర్పంచులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
