పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో మంచిర్యాల జిల్లాకు 2వ స్థానం : కలెక్టర్ కుమార్ దీపక్

పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో మంచిర్యాల జిల్లాకు 2వ స్థానం : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్​లో మంచిర్యాల జిల్లా 360 స్కోర్​తో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్​లోని తన ఛాంబర్​లో అడిషనల్ కలెక్టర్, డీఈవో పి.చంద్రయ్య, అధికారులతో కలిసి పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ నివేదికను విడుదల  చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2024–25 విద్యా సంవత్సరంలో 324 స్కోర్ తో జిల్లా 3వ స్థానంలో నిలువగా అన్ని విభాగాల్లో మరింత మెరుగై ఈ ఏడాది 360 స్కోర్ తో 2వ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ సైతం తన స్థానాన్ని మెరుగుపరచుకొని జాతీయస్థాయిలో 18వ స్థానం సాధించినట్లు చెప్పారు. 

టాయిలెట్స్​లేని ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్లను గుర్తించి మౌలిక వసతులు కల్పించడంతో పాటు అమ్మ ఆదర్శ స్కూళ్ల పనుల ద్వారా తాగునీరు, విద్యుత్, క్లాస్​రూమ్​లకు అవసరమైన రిపేర్లు చేపట్టడం, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ లు నిర్మించడం, ఆర్ఓ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎక్కువ స్కోరు సాధించామని తెలిపారు. డిజిటల్ విద్యను బలోపేతం చేయడం ద్వారా డిజిటల్ విద్యా విభాగంలో స్కోరు మెరుగైందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు ఎం.భరత్ కుమార్, జంబోజు సత్తయ్య, కృష్ణమూర్తి, రాజ్ కుమార్  పాల్గొన్నారు.