ఛీ.. ఏం బతుకురా మీది..చిన్నారులను చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు..స్వేచ్చకు అడ్డుగా ఉన్నారని వాతలు పెట్టిన పేరెంట్స్

ఛీ.. ఏం బతుకురా మీది..చిన్నారులను చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు..స్వేచ్చకు అడ్డుగా ఉన్నారని వాతలు పెట్టిన పేరెంట్స్
  • తమకు అడ్డుగా ఉన్నారని విచక్షణారహితంగా కొట్టిన పేరెంట్స్​ 
  • సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఘటన

హుజూర్ నగర్, వెలుగు : తమకు అడ్డుగా ఉన్నారన్న కారణంతో తల్లిదండ్రులే ఇద్దరు చిన్నారులను కొడుతూ, వాతలు పెడుతూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో వెలుగుచూసింది. ఎస్సై చలికంటి నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీకి నకిరేకంటి రవి, ఇందు అలియాస్ అఖిల భార్యాభర్తలు.రవికి గతంలోనే వివాహం కాగా.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలను తీసుకొని భార్య వెళ్లిపోయింది. 

ఇందుకు సైతం గతంలోనే పెళ్లి జరుగగా.. బాబు పుట్టిన తర్వాత భర్తకు దూరంగా ఉంటోంది. రవి, ఇందు నాలుగేండ్ల కింద రెండో వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు హేమంత్ (2)తో పాటు, అఖిలకు మొదటి భర్తతో పుట్టిన ధనుశ్ (5)తో కలిసి ఎన్ఎస్పీ కాలనీలో ఉంటున్నారు. రవి లారీ డ్రైవర్ గా పనిచేస్తుండగా, ఇందు కూలి పనులకు వెళ్లేది. 

ఈ క్రమంలో తమ సుఖానికి, స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నారన్న కారణంతో రవి, ఇందు కలిసి ధనుశ్, హేమంత్ ను ప్రతి రోజు విపరీతంగా కొడుతూ, వాతలు పెట్టేవారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సైతం పిల్లలిద్దరి శరీరంపై ఇనుప కాడతో వాతలు పెట్టడంతో వారు ఏడుస్తూ బయటకు వచ్చారు. గమనించిన స్థానికులు తల్లిదండ్రులను నిలదీశారు.

 అనంతరం చిన్నారులను వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఐసీడీఎస్ ఆఫీసర్ నిర్మల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చిన్నారిలిద్దరికీ చికిత్స అందించిన అనంతరం సూర్యాపేటలోని బాల రక్షక్ భవన్  లో అప్పగించారు.