కోల్బెల్ట్: మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఫొటోలకు క్షీరాభిషేకం

కోల్బెల్ట్: మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఫొటోలకు క్షీరాభిషేకం

కోల్​బెల్ట్, వెలుగు: తాడిచర్ల బొగ్గు బ్లాక్​ 2ను సింగరేణి సంస్థకు కేటాయించడంలో విశేష కృషి చేసిన సీఎం రేవంత్ ​రెడ్డి, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్​ లీడర్లు గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని పార్టీ ఆఫీస్​లో వారి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. తాడిచర్ల 2 గనిని సింగరేణికి కేటాయించేందుకు ఎంపీ వంశీకృష్ణ పార్లమెంటులో నిరంతంరం తన గళాన్ని వినిపించారని అన్నారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ తరచూ ప్రధాని, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిని కలిసి గని కేటాయింపు కోసం విన్నవించారని, వారి కృషి ఫలితంగా బొగ్గు బ్లాక్​దక్కిందన్నారు. దీంతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ టౌన్ ప్రెసిడెంట్ తిరుమల్​రెడ్డి, లీడర్లు బండి సదానందం యాదవ్, ఎర్ర రాజు, సునీల్, పవన్, ఆర్.గణేశ్, సీహెచ్.శశి, ప్రభాకర్, మహిళా లీడర్లు పాల్గొన్నారు.

మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కృషి వల్లనే..

గోదావరిఖని: రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ చేసిన నిరంతర కృషి ఫలితంగానే తాడిచర్ల కోల్ బ్లాక్- 2ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి అప్పగించిందని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంత కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.మల్లికార్జున్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడిచర్ల కోల్ బ్లాక్-2ను సింగరేణికి కేటాయించాలని గతంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారని గుర్తుచేశారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని పలుమార్లు కలిసి వినతిపత్రాలు సమర్పించి, ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారని పేర్కొన్నారు. వారి నిరంతర ప్రయత్నాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని మల్లికార్జున్ తెలిపారు.