- జిల్లాలో ముగిసిన సర్వే.. మొత్తం 74,683 వనరులు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలో కంటే నీటి వనరులు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు, బావులు, బోర్లు, లిఫ్ట్ ఇరిగేషన్‌లతో సహా అన్ని నీటి వనరుల లెక్కింపు పూర్తయింది. ఈసారి సర్వేను పూర్తి సాంకేతికంగా నిర్వహిస్తూ, ప్రతీ నీటి వనరు వద్దకు వెళ్లి ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రతీ నీటి వనరుకు ప్రత్యేకంగా ఒక నెంబర్‌ను కేటాయించారు. అగ్రికల్చర్, పంచాయతీ, డీఆర్‌డీఏ శాఖలకు చెందిన సిబ్బంది ఈ సర్వేలో భాగస్వాములయ్యారు.
ప్రతీ ఐదేండ్లకు ఒకసారి..
ప్రతీ ఐదేండ్లకు ఒకసారి బావులు, బోర్లు, చెరువులను రెవెన్యూ గ్రామాల్లో లెక్కిస్తారు. వీటితో పాటు లిఫ్ట్ ద్వారా నీటి తరలింపును కూడా లెక్కిస్తారు. 1986-లో దేశవ్యాప్తంగా ప్రారంభమైన లెక్కింపు 2019 వరకూ మాన్యువల్‌గా జరిగింది. ఇప్పటివరకూ ఆరుసార్లు జరిగిన ఈ సర్వే 2025-–26 లో సాంకేతికంగా నిర్వహించారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏఈవో, పంచాయతీ నుంచి జీపీవో, డీఆర్‌డీఏ నుంచి టెక్నికల్ అసిస్టెంట్లు ఈ సర్వేలో పాల్గొన్నారు.
బావులు, బోర్ల లెక్కింపు..
యాదాద్రి జిల్లాలోని 320 రెవెన్యూ గ్రామాల్లోని చెరువులు, కుంటలతో పాటు బోర్లు, బావులు, లిఫ్ట్‌లు లెక్కించారు. ఈ సర్వే కోసం ప్రతీ ఎన్యూమరేటర్ నీటి వనరుల వద్దకు వాటికి నెంబర్లు కేటాయించడంతో పాటు సీజన్ల వారీగా ఏఏ పంటలు పండిస్తున్నారో కూడా నమోదు చేశారు. చేపల పెంపకానికి చెరువులు ఉపయోగిస్తే అవే వివరాలను నమోదు చేశారు. బోర్లకు సంబంధించి భూగర్భ జలమట్టాలు ఎంత లోతుల్లో ఉన్నాయో లెక్కింపు చేశారు.
చెరువులు, బోర్లు, బావుల తవ్వకం ఎప్పుడు జరిగింది, వాటి విలువతో పాటు అవి ఉన్న సర్వే నెంబర్, బై నెంబర్లు, ఖాళీ ప్లాట్లలో ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్లు పేర్కొంటూ ఓనర్ల పేర్లు కూడా నమోదు చేశారు. చెరువులకు వాడుకలో ఉన్నపేర్లతో పాటు ఉపయోగంలో ఉన్న వనరుల కారణంగా ఎన్ని ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలో పేర్కొన్నారు.
జిల్లాలో 74,683 వనరులు..
తాజా లెక్కల ప్రకారం యాదాద్రి జిల్లాలో 74,683 నీటి వనరులు ఉన్నాయి. వీటిలో బావులు, బోర్లు కలిపి 69,783 ఉండగా చెరువులు1,398 ఉన్నాయి. లిఫ్ట్ లు 3,502 ఉన్నాయి. కాగా 2019లో నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో 7,109 బావులు, 53,908 బోర్లు ఉన్నాయి. చెరువులు, కుంటలు, లిఫ్ట్స్ కలిపి 4,975 ఉన్నాయి. ఈ లెక్కన గతంలో కంటే నీటి వనరులు పెరిగాయి. అందులోనూ కాల్వల నుంచి లిప్ట్‌లు పెరిగాయి.
ఒక్కో వనరుకు ప్రత్యేక కోడ్
ప్రతీ రెవెన్యూ గ్రామంలోని నీటి వనరుల ఫొటోలు క్యాప్చర్ చేస్తూ వాటిని జియో ట్యాగింగ్ చేశారు. దీంతో పాటు ఒక్కో గ్రామంలోని మొదటి నీటి వనరుకు 001 నుంచి కోడ్ నెంబర్ కేటాయిస్తున్నారు. ఈ నెంబర్‌కు మరో 18 అంకెలు కలిపి అంటే గ్రామం, వార్డు, పట్టణం, బ్లాక్, జిల్లా, రాష్ట్రం ఇలా వీటికి కేటాయించిన నెంబర్లను కలుపుతూ 21 అంకెలు గల ప్రత్యేక నెంబర్‌ను కేటాయించారు.
