- చెరువ వద్ద గ్రామస్తులు, రైతుల ఆందోళన
తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలోని ఊర చెరువు భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపిస్తూ గ్రామస్తులతో పాటు రైతులు గురువారం చెరువులోనే ఆందోళనకు దిగారు. వారి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెట్టెం కిరణ్ అనే వ్యక్తి ఇదే గ్రామానికి చెందిన దూల్గుంటి రాంచంద్రారెడ్డి దగ్గర నుంచి ఊరచెరువు ఎఫ్టీఎల్ ఉన్న ఎకరం 23 గుంటల ఏక్ సాల్ భూమిని గతంలో కొనుగోలు చేశాడు. ఆ భూమిని కాస్తు చేసుకుంటున్న కిరణ్ కొద్దిరోజుల క్రితం ఆ భూమిలో 3 గజాల ఎత్తులో మట్టిని నింపాడు.
చెరువులోకి నీరు వచ్చే మత్తడిలోని కొంత భూమితో పాటు గ్రామంలో నుంచి వచ్చే ప్రధాన మురికి కాలువను సైతం పూర్తిగా కూడ్పివేశాడు. మరో 15 గుంటల చెరువు భూమిని ఆక్రమించి మొత్తంగా రెండెకరాల భూమిని కబ్జా చేశాడని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో చెరువులోకి ఇన్‌ఫ్లో వచ్చే ప్రాంతమంతా ఎత్తుగా మారిందని, వరదొస్తే చెరువులోనికి వెళ్లకుండా ఇండ్లల్లోకి వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. విషయాన్ని కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్ తాట్ల తిరుపతి, ఉప సర్పంచ్ మహేశ్, రైతులు వార్డు సభ్యులు, సీపీఐ మండల కార్యదర్శి బి.తిరుపతి పాల్గొన్నారు.
