ఏసీబీకి చిక్కిన చొప్పదండి మండల ఇరిగేషన్ ఏఈ..ఉపాధి పనుల కొలతల నమోదుకు లంచం డిమాండ్

ఏసీబీకి చిక్కిన చొప్పదండి మండల ఇరిగేషన్ ఏఈ..ఉపాధి పనుల కొలతల నమోదుకు లంచం డిమాండ్

కరీంనగర్ క్రైమ్/గంగాధర, వెలుగు : సీసీ రోడ్డు పనులను ఎంబుక్ లో నమోదు చేసేందుకు లంచం తీసుకున్న కరీంనగర్ జిల్లా గంగాధర మండల ఇరిగేషన్ ఇన్ చార్జి ఏఈని ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం... చొప్పదండి మండలంలో ఇరిగేషన్ ఏఈగా పనిచేస్తున్న పైడి సతీశ్.. గంగాధర మండలానికి ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. 

ఈ క్రమంలో ఉపాధి హామీ కింద మండలంలోని నాగిరెడ్డిపూర్ గ్రామంలో వేసిన సీసీ రోడ్డు పనుల కొలతలను ఎంబీ బుక్ లో నమోదు చేసి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కు పంపించేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ. 10 వేలు డిమాండ్ చేశారు. 

దీంతో సదరు బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచనతో గురువారం సాయంత్రం ఏఈని కలిసి డబ్బులు ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఏఈ సతీశ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బైక్ సీటు కింద దాచిన డబ్బులను స్వాధీనం చేసుకొని, ఏఈని కరీంనగర్‌‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.