- ముగ్గురి పరిస్థితి విషమం
వేములవాడ, వెలుగు : కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకరు చనిపోగా, మరో 22 మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామం వద్ద గురువారం జరిగింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన కూలీలు బోయినపల్లి మండలం జగ్గరావుపల్లి వద్ద ఉంటూ చుట్టుపక్కల పొలాల్లో వరినాట్లు వేస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం తంగలపల్లి మండలం లక్ష్మీపురంలో నాట్లు వేసి సాయంత్రం ఆటోలో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అనుపురం వద్దకు రాగానే సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో అతుల్ (35) అక్కడికక్కడే చనిపోగా, మరో 22 మంది గాయపడ్డారు.
స్థానికులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టౌన్సీఐ వీరప్రసాద్, ఎస్సై రాంమోహన్ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు, 12 మందిని వేములవాడ ఏరియా హాస్పిటల్ కు, మరో ఏడుగురిని సిరిసిల్ల హాస్పిటల్ కు తరలించారు.
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేశ్ బి. గీతే, వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్ హాస్పిటల్ కు చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
కారు బోల్తా పడి ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
లక్ష్మణచాంద (మామడ), వెలుగు : కారు అదుపుతప్పి ఒకరు చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి సమీపంలో గురువారం జరిగింది. ఖానాపూర్ మండలం రాజుర గ్రామానికి చెందిన గంగిడి దశరథ్ రెడ్డి (50), పుష్పలత, గంగారెడ్డి, లింగారెడ్డి, భీంరెడ్డి, లక్ష్మి కలిసి కారులో దిలావర్ పూర్ మండలం పాత సాంగ్వి గ్రామంలో జరిగిన బంధువు అంత్యక్రియలకు హాజరయ్యారు. అనంతరం తిరిగి వస్తుండగా... దిమ్మదుర్తి సమీపంలో కుక్క అడ్డురావడంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో దశరథ్ రెడ్డి అక్కడికక్కడే చనిపోగా మిగతా వారికి గాయాలయ్యాయి.
