- సీఎం సొంత సర్వేలోనే ఈ విషయం తేలిందని వ్యాఖ్య
పద్మారావునగర్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనే ఈ విషయం స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. సగం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో సీఎం చేయించుకున్న విస్తృత సర్వేలో ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమైందని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గురువారం జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్చార్జ్ల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్ 78 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ సర్వేలు తేల్చాయన్నారు. రెండు మీడియా సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల ప్రజాభిప్రాయ సేకరణలోనూ ప్రజలు కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్టు వెల్లడైందని కేటీఆర్ ప్రస్తావించారు.
