ట్రంప్‌ను వదలం.. ఖమేనీ అంతిమయాత్రలో ఇరాన్ ప్రజల నినాదాలు

ట్రంప్‌ను వదలం.. ఖమేనీ అంతిమయాత్రలో ఇరాన్ ప్రజల నినాదాలు

దుబాయ్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర ఇరాన్‌లోని ఆయన స్వస్థలం మషాద్ నగరంలో ముగిసింది. గురువారం సాయంత్రం మషాద్ సిటీలోని ‘ఇమామ్ రెజా’ పుణ్యక్షేత్రం వద్దకు ఖమేనీ భౌతికకాయాన్ని చేర్చారు. యుద్ధ వాతావరణం, భద్రతా కారణాల వల్ల 4 నెలలు ఆలస్యంగా ఖమేనీ అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 4న టెహ్రాన్‌లో ప్రారంభమైన అంతిమయాత్ర.. ఇరాన్‌లోని ఖోమ్, ఇరాక్‌లోని షియా పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలా మీదుగా సాగి మషాద్‌కు చేరుకుంది. 

వారం రోజుల పాటు సాగిన అంతిమయాత్రలో 3 కోట్ల మందికి పైగా ప్రజలు నల్లటి దుస్తులు ధరించి పాల్గొన్నారు. కేవలం మషాద్ నగరంలోనే లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. " ట్రంప్‌ను చంపేస్తాం" అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. ట్రంప్‌పై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని.. తమ నాయకుడి సాక్షిగా అమెరికాను వదిలిపెట్టబోమంటూ ఎరుపు రంగు రివెంజ్ జెండాలతో నినాదాలు చేశారు. 

ఖమేనీ భౌతికకాయాన్ని ఇమామ్ రెజా పుణ్యక్షేత్రంలో ఖననం చేయనున్నారు. కాగా, తన తండ్రి ఖమేనీ మరణించిన రోజే తీవ్రంగా గాయపడిన కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించలేదు. ఇప్పుడు తండ్రి అంతిమయాత్రకు సైతం ఆయన హాజరుకాలేని స్థితిలో ఉన్నారని సమాచారం.