ఇరాన్‌‌‌‌‌‌‌‌పై అమెరికా క్షిపణుల వర్షం.. ఏకంగా 90 టార్గెట్లపై యూఎస్ దళాల అటాక్  

ఇరాన్‌‌‌‌‌‌‌‌పై అమెరికా క్షిపణుల వర్షం.. ఏకంగా 90 టార్గెట్లపై యూఎస్ దళాల అటాక్  

వాషింగ్టన్/దుబాయ్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. రెండో రోజు గురువారం కూడా ఇరు దేశాలు వరుసగా ఒకరిపై ఒకరు మిసైళ్లతో దాడులు చేసుకున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ముగిసిపోయింది. మంగళవారం హార్మూజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో యుద్ధం మళ్లీ ప్రారంభం కాగా.. దీనికి ప్రతీకారంగా అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంపై విరుచుకుపడింది.

 ఇరాన్ వ్యాప్తంగా ఉన్న దాదాపు 90 సైనిక లక్ష్యాలపై అమెరికా వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. కేవలం రెండు రోజుల దాడుల్లోనే ఇరాన్ సైన్యానికి చెందిన 14 మంది మరణించగా.. మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతేగాక, భారీ వైమానిక, క్షిపణి దాడుల వల్ల ఇరాన్ భూభాగంలో సైనిక, పౌర, రవాణా మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

విమానాశ్రయ రన్‌‌‌‌‌‌‌‌వేలు, క్షిపణి లాంచర్లు, రాడార్ కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ భారీ దాడులకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా అమెరికా సైనిక స్థావరాలు ఉన్న కువైట్, బహ్రెయిన్, ఖతార్ వంటి పొరుగు అరబ్ దేశాలపై ఎదురుదాడులు చేసింది. 

అమెరికా టార్గెట్ చేసిన ప్రాంతాలివే..

అమెరికా సైన్యం ఇరాన్‌‌‌‌‌‌‌‌లోని దాదాపు 90 సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ముఖ్యంగా ఇరాన్ ఆగ్నేయ నగరమైన ఇరాన్‌‌‌‌‌‌‌‌షహర్‌‌‌‌‌‌‌‌లోని వైమానిక స్థావరంపై బాంబులు వేసింది. ఈ స్థావరాన్ని ఇరాన్ సైన్యానికి చెందిన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)' వాడుకుంటోంది. అలాగే, ఓడరేవు నగరమైన చబహార్‌‌‌‌‌‌‌‌పై కూడా అమెరికా దళాలు భీకర దాడులు చేశాయి. ఇక్కడి రేవు పీర్లు(కాంక్రీట్, ఇనుప ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌లు), మెరైన్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌‌‌‌‌‌‌‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 
దాంతో చబహార్ నగరం అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటిమయమైంది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత చబహార్‌‌‌‌‌‌‌‌ ఓడరేవుపై దాడి జరగడం ఇదే మొదటిసారి. వీటితో పాటు కొనారక్, బందర్ అబ్బాస్, సిరిక్ వంటి తీరప్రాంత నగరాల్లో కూడా పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. 

ఇరాన్ ఈశాన్య ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లోని ఒక రైల్వే వంతెనతో పాటు మష్హాద్ సిటీకి వెళ్లే మార్గంలో ఉన్న మరో రెండు కీలక వంతెనలను అమెరికా క్షిపణులు ధ్వంసం చేశాయి. ఇరాన్ ఏకైక అణు విద్యుత్ ప్లాంట్ ఉన్న బుషెహర్ కాంప్లెక్స్ ఏరియాలో కూడా అమెరికా వైమానిక దాడికి పాల్పడిందని ఇరాన్ అధికారులు ఆరోపించారు. అయితే, దీన్ని అమెరికా సైన్యం ఇంకా కన్ఫామ్ చేయలేదు. 

20 రెట్లు బలంగా తిప్పికొడతాం: ట్రంప్

ఈ దాడుల తీవ్రతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా ఘాటుగా స్పందించారు. ఇరాన్ తమ పౌర నౌకలపై దాడులు చేస్తే.. అంతకంటే 20 రెట్లు బలంగా అమెరికా సైన్యం ఇరాన్ లక్ష్యాలపై విరుచుకుపడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్ దేశం తమకు ఫోన్ చేసిందని.. వారు ఒప్పందం కోసం బతిమాలుతున్నారని చెప్పారు. 

కానీ, ఇరానియన్లు మాట మీద నిలబడే రకం కాదని.. వారు శాంతి ఒప్పందాన్ని గౌరవిస్తారనే నమ్మకం లేదని వెల్లడించారు. ఇరాన్ నాయకులను పిచ్చివాళ్లుగా సంబోధించిన ఆయన.. అవసరమైతే ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలైన విద్యుత్ ప్లాంట్లు, ఉప్పునీటిని మంచినీరుగా మార్చే ప్లాంట్లను కూడా నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 

బెదిరింపులకు లొంగం: ఇరాన్

ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వం, అక్కడి అగ్రనాయకులు అంతే బలంగా కౌంటర్ ఇచ్చారు. అమెరికా బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తి లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ ఖలీబాఫ్ స్పష్టం చేశారు. "అమెరికా ఇంకా బుద్ధి తెచ్చుకోలేదు. బెదిరింపులు, నిబంధనల ఉల్లంఘనలకు ఎలాంటి శిక్ష ఉంటుందో వారికి త్వరలోనే తెలుస్తుంది. మీరు మాపై దాడి చేస్తే.. మేం మీపై ఎదురుదాడి చేస్తూనే ఉంటాం" అని అమెరికాను హెచ్చరించారు.  

ఎదురుదాడి చేసిన ఇరాన్

అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా భీకరమైన ఎదురుదాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న పొరుగు అరబ్ దేశాలైన కువైట్, బహ్రెయిన్, ఖతార్‌‌‌‌‌‌‌‌లతో పాటు జోర్డాన్‌‌‌‌‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైన్యం క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ ఆకస్మిక దాడులతో మిడిల్ ఈస్ట్‌‌‌‌‌‌‌‌లో యుద్ధ తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. అమెరికా నౌకాదళానికి చెందిన '5వ ఫ్లీట్(నావికాదళ కేంద్రం)' ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌లో ముప్పును సూచిస్తూ మూడుసార్లు డేంజర్ సైరన్లు మోగాయి. 

ఇరాన్ ప్రయోగించిన మూడు బాలిస్టిక్ క్షిపణులు, ఒక క్రూయిజ్ క్షిపణి,10 డ్రోన్లను తాము గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నామని కువైట్ సైన్యం ప్రకటించింది. అయితే, వీటి శిథిలాలు కింద పడటంతో కువైట్‌‌‌‌‌‌‌‌లో ఒకరు గాయపడ్డారు. ఖతార్, జోర్డాన్ దేశాలపైకి కూడా ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లినప్పటికీ, అక్కడ జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.