బీజింగ్: చైనాలోని ఓ ప్రముఖ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 28మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. ఫుజియాన్ ప్రావిన్స్‌లోని జిన్‌జియాంగ్ సిటీలో ఉన్న ‘హుయిటెంగ్ షూస్’ ఫ్యాక్టరీలో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు.
పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని.. అదే సమయంలో బాధ్యులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం ఫ్యాక్టరీలో చిన్నగా మొదలైన మంటలు నిమిషాల్లోనే భవనం మొత్తం వ్యాపించాయి. షూస్ తయారీకి ఉపయోగించే సామగ్రికి మండే స్వభావం ఎక్కువగా ఉండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. దీంతో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ అలుముకుంది.
అందులో చిక్కుకున్న కార్మికులు బిల్డింగ్ పైకి చేరి ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. రెస్క్యూ బృందాలు వెంటనే స్పాట్‌కు చేరుకున్నాయి. ఫ్యాక్టరీ లోపల ప్రమాదకర పరిస్థితులు ఉండడంతో లోనికి ప్రవేశించలేకపోయాయి. దీంతో మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడటం కష్టంగా మారింది.
