హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరగాలని, దమ్ముంటే ఆ చర్చకు హరీశ్ రావు తన మామ, మాజీ సీఎం కేసీఆర్‌ను వెంటబెట్టుకొని రావాలని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సవాల్ విసిరారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు నిత్యం అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అయితే, వారి మాటలను నమ్మే స్థితిలో ప్రజలు ఇప్పుడు లేరని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కాస్తా కూలేశ్వరంగా మారిందని విమర్శించారు. ప్రాజెక్టు డిజైన్లలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి హరీశ్ రావు వందల అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన తీరును ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలు అవుతాయని మెట్టు సాయికుమార్ జోస్యం చెప్పారు.
