ధర్మసాగర్(వేలేరు), వెలుగు: గండి రామారం ఎత్తిపోతల పథకం ద్వారా అతి త్వరలోనే వేలేరు మండలానికి గోదావరి జలాలు తీసుకువచ్చి రెండు పంటలకు సాగునీరు అందిస్తామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. వేలేరు మండలం శాలపల్లి, లక్ష్మీతండా, బంగ్లాపల్లి, గొల్లకిష్టంపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. శాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు, గ్రామ మహిళా సమాఖ్య భవనం, లక్ష్మీతండాలో ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లను ప్రారంభించారు.
బంగ్లాపల్లిలో ఇందిరమ్మ ఇండ్లు, గొల్లకిష్టంపల్లిలో సీసీ రోడ్లు, పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 11మంది కల్యాణలక్ష్మి -షాదీ ముబారక్ లబ్ధిదారులకు, 20మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శాలపల్లిపై ఉన్న ప్రత్యేక అభిమానంతో పైలెట్ గ్రామంగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 15ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఏం చేశానో ఆలోచించాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన వేలేరు మండలానికి తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీసులు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే వాటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
