మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : మహబూబ్‌నగర్ రూరల్ మండల పరిధిలోని అడవి వెంకటాపురం గ్రామంలో గురువారం బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల అభివృద్ధికి, ప్రజల ఐక్యతకు తోడ్పడతాయని, ప్రజలంతా ఐకమత్యంతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలోని శివ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేసి అర్చకుల వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం హనుమాన్ గుట్టపై వెలసిన స్వయంభూ వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే, జైనల్లీపూర్, తువ్వ గడ్డ తండాలలో గృహప్రవేశ కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.
