గద్వాల, వెలుగు: మద్యానికి బానిసైన ఓ భర్త క్షణికావేశంలో భార్యపైనే కొడవలితో దాడికి పాల్పడిన ఘటన గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిమ్మప్ప అనే వ్యక్తి మద్యానికి బానిసై తరచూ భార్య మహేశ్వరితో గొడవపడేవాడు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తిమ్మప్ప ఇంట్లోని కొడవలితో మహేశ్వరి తలపై బలంగా నరికాడు. తీవ్రగాయాలైన ఆమెను స్థానికులు వెంటనే గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
