- ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్స్‌కు వాయిస్ మెసేజ్‌లు
పద్మారావునగర్, వెలుగు: ‘సర్’ విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పనిచేస్తున్న బీఎల్‌వోలు, ఆశవర్కర్లు, ఆర్‌పీలు తమ బకాయి జీతాలు విడుదల చేయాలని, లేకపోతే ‘సర్’ డ్యూటీని బహిష్కరిస్తామని ధర్నాలు చేపట్టిన నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్‌లకు వరుసగా వాయిస్ మెసేజ్‌లు పంపుతూ విధుల్లో చేరాలని స్పష్టం చేశారు.
ఎలాంటి మినహాయింపులు లేకుండా ప్రతి ఒక్కరూ హాజరుకావాలని, ఈ విషయమై ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో), కలెక్టర్‌తో చర్చలు జరిగాయని పేర్కొన్నారు. విధులకు రాని వారి వివరాలను హెడ్డాఫీస్‌కు పంపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. రేపటి నుంచి ఎలాంటి సాకులు చెప్పకుండా విధులకు అటెండ్ కావాలని చెప్పారు. ఒకవైపు ఉద్యోగుల ఆందోళనలు, మరోవైపు అధికారుల ఎఫ్‌ఐఆర్ హెచ్చరికలు కంటోన్మెంట్ ప్రాంతంలో చర్చనీయాంశమయ్యాయి.
