కొల్లాపూర్,వెలుగు: కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న పోడు, వ్యవసాయ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
గురువారం కొల్లాపూర్ సమీపంలోని సోమశిలలో నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌తో కలిసి రైతుల సమక్షంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో చర్చించి, రైతుల అర్జీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పకుండా నేరుగా క్షేత్రస్థాయికే వెళ్లి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి రైతుకూ న్యాయం చేయాలన్నారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్‌లు, సర్వే నంబర్లు, పాత రికార్డులను సంబంధిత ఆర్డీవో కార్యాలయంలో అందించాలని కోరారు.
క్షేత్రస్థాయి సర్వేలో అర్హత ఉన్నట్లు తేలిన భూములను నిబంధనల ప్రకారం భూ భారతి పోర్టల్‌లో నమోదు చేసి, రైతులకు చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.
