పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసై వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని కొట్టి చంపారు భార్య, కొడుకు. వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండలం కాశిపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ గోరెమియా, గోరీబీ భార్యభర్తలు. వీరిద్దరికి గత కొంత కాలంగా గొడవలు జరగుతున్నాయి.
దీంతో ఇద్దరు వేర్వేరుగానే ఉంటున్నారు. గత కొంతకాలంగా జగిత్యాలలో ఉంటున్న సయ్యద్ రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే గురువారం (జులై 9) రాత్రి మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గోరీబీ భర్తపై రాళ్లతో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సయ్యద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుడి భార్యతో పాటు కుమారుడు సయ్యద్ అలీని అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్సై చంద్ర కుమార్ తెలిపారు.
