దేశ వ్యాప్తంగా ఓటర్ సవరణ జాబితా (SIR) ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఓటర్లు ఎన్ రోల్ చేసుకుంటున్నారు. అయితే ఫామ్ నింపడానికి రాని కొందరు నిరక్ష్యరాసుల నుంచి ఆధార్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు డబ్బులు వసూలు చేస్తుండటంపై అధికారులు ఫోకస్ పెట్టారు. జార్ఖండ్ రాష్ట్రంలో డబ్బులు వసూలు చేస్తున్న ఒక ఆధార్ సెంటర్ సీజ్ చేశారు అధికారులు.
ధన్‌బాద్ జిల్లాలోని వాస్సేపూర్‌లోని ఒక ఆధార్ కేంద్రాన్ని గురువారం (జులై 09) అధికారులు సీల్ చేశారు. ఆధార్ సెంటర్ లో ఫారాలు నింపడానికి ప్రైవేటుగా ఫీజులు తీసుకునే అధికారం లేనప్పటికీ.. ఆ కేంద్రంలో రూ. 50 నుంచి రూ. 100 వరకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోదాల సమయంలో ఆపరేటర్ అందుబాటులో లేడు, అతని ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఓటర్ల జాబితాలను నవీకరించడానికి, ధృవీకరించడానికి జార్ఖండ్ అంతటా ఎన్నికల సంఘం SIR ప్రచారం కొనసాగుతోంది. ఫారాలు సమర్పించడంలో సహాయం కోసం వాస్సేపూర్ కేంద్రం పౌరుల నుంచి రుసుము వసూలు చేస్తోందని యంత్రాంగానికి సమాచారం అందింది. దీంతో తక్షణమే చర్యలు తీసుకున్నామమని సబ్-డివిజనల్ ఆఫీసర్ (SDO) లోకేష్ బరంగే తెలిపారు.
►ALSO READ | దేశంలో పర్మనెంట్ EMIల జనరేషన్ పెరిగింది.. మధ్యతరగతి జీవితంలో భాగమైన అప్పులు
అనధికార ఏజెన్సీలు, సైబర్ కేఫ్‌లు, ఆధార్ కేంద్రాలు లేదా మధ్యవర్తులపై ఆధారపడవద్దని ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కోరారు. ఓటర్లు గణన పత్రాన్ని (SIR ఫామ్) స్వయంగా నింపాలి లేదా బూత్ స్థాయి అధికారి (BLO), సూపర్‌వైజర్ లేదా వాలంటీర్ల సహాయం మాత్రమే తీసుకోవాలని సూచించారు.
ప్రైవేట్ ఏజెంట్లు నింపిన ఫారాలలో తప్పుడు వివరాలు ఉండవచ్చని, అది ఓటరు ఎన్నికల రికార్డును ప్రభావితం చేస్తుందని బరంగే హెచ్చరించారు. ఫీజులు వసూలు చేయడానికి ప్రైవేట్ కేంద్రాలకు ఎన్నికల సంఘం అధికారం ఇవ్వలేదని చెప్పారు.
తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి పేర్లను మోసపూరితంగా చేర్చడం లేదా తొలగించడం వంటివి చేస్తే, ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఇతర నిబంధనల కింద చర్యలు తీసుకుంటామని ఎస్డీఓ హెచ్చరించారు. ఎస్ఐఆర్ ఉచితం అని.. ఎన్నికల యంత్రాంగం మాత్రమే నిర్వహించే ప్రక్రియ అని అన్నారు. ప్రజలు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.
