మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన గోట్ లైఫ్ సినిమా చూసే ఉంటారు. ఉద్యోగం కోసమని సౌదీ వెళ్లిన హీరోను ఏజెంట్ మోసం చేయడం.. తిరిగి రాలేని పరిస్థితుల్లో ఎడారిలో ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించడం.. చావు బతుకుల మధ్య చివరికి ఇండియా చేరడం.. అచ్చం అలాంటి సీనే మళ్లీ రిపీటయ్యింది. జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు సౌదీ ఎడారిలో చిక్కుకుపోయి సహాయం కోసం వేడుకుంటున్న వీడియో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుట్టల్లపల్లి గ్రామానికి చెందిన అరవింద్ ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఏజెంట్ మోసం చేయడంతో అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు.
తనను ఎజెంట్ మోసం చేసి ఎడారి ప్రాంతంలో వదిలేశాడని, తిండి, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపాడు. గొర్రెలకు పెట్టే నీళ్లనే తాగాల్సిన దుస్థితి నెలకొందని, ప్రాణభయంతో రోజులు గడుపుతున్నానని కన్నీటి పర్యంతమయ్యాడు.
తనను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత రాయబార కార్యాలయం, ప్రజాప్రతినిధులు స్పందించి సహాయం చేయాలని వీడియోలో వేడుకున్నాడు.
ప్రస్తుతం అరవింద్ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అధికారులు స్పందించి అతడిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
