మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా..? అయితే మీ ప్రైవసీ ప్రమాదంలో పడినట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లోకి 'మ్యూజ్ ఇమేజ్' (Muse Image) అనే కొత్త AI టూల్‌ను తీసుకొచ్చింది. అయితే, దీనిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అసలు సమస్య ఏంటి?
ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎవరైనా సరే.. మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పేరును ప్రాంప్ట్ లాగా ఇచ్చి, మీ ముఖాన్ని పోలిన సరికొత్త AI ఫోటోస్ సృష్టించవచ్చు. అంటే, మీ అనుమతి లేకుండానే మీ ముఖాన్ని AI సహాయంతో క్లోన్ చేసే అవకాశం ఉందన్నమాట.
అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. ఈ ఫీచర్‌ను వాడుకోవడానికి మెటా సంస్థ యూజర్ల అనుమతి అడగలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్ అకౌంట్ (Public Account) ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఫీచర్‌ను ఆటోమేటిక్‌గా ఆన్ (Default Opt-in) చేసేసింది.
ఇంటర్నెట్ యూజర్లు, నిపుణుల ఆగ్రహం
ప్రముఖ టెక్ రివ్యూయర్ సహా పలువురు గోప్యతా పరిరక్షకులు దీనిపై మండిపడుతున్నారు. ప్రజలు ఎప్పుడో ఏళ్ల క్రితం సరదాగా పోస్ట్ చేసిన ఫోటోలను, ఇప్పుడు AI ట్రైనింగ్ కోసం వాడుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది యూజర్లు అయితే.. Facebook, Instagram, WhatsApp యాప్‌లను పూర్తిగా డిలీట్ చేయడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
ఈ ఫీచర్‌ను సెట్టింగ్స్‌లోకి వెళ్లి మాన్యువల్‌గా ఆఫ్ చేసిన.. కొద్దిసేపటికి ఎటువంటి హెచ్చరిక లేకుండా అది దానంతట అదే మళ్లీ ఆన్ అయిపోతోందని చాలా మంది యూజర్లు స్క్రీన్ రికార్డింగ్‌లతో సహా ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు. దీనికి అకౌంట్‌ను పూర్తిగా ప్రైవేట్‌గా మార్చుకోవడమే ఏకైక మార్గమని అంటున్నారు.
మెటా ఏం చెబుతుందంటే
ఈ టూల్‌కు పటిష్టమైన భద్రతా నియమాలు ఉన్నాయని మెటా చెబుతోంది. 18 ఏళ్ల లోపు ఉన్నవారికి, అలాగే ప్రైవేట్ అకౌంట్లు ఉన్నవారికి ఈ ఫీచర్ వర్తించదు. కేవలం పబ్లిక్ అకౌంట్ల నుండి మాత్రమే ఇది డేటాను తీసుకుంటుంది. ఎవరైనా అభ్యంతరకరమైన ఫోటోలు క్రియేట్ చేస్తే, ఆ ఇమేజ్‌పై లాంగ్ ప్రెస్ చేసి 'థంబ్స్-డౌన్' క్లిక్ చేయడం ద్వారా రిపోర్ట్ చేయవచ్చు.
►ALSO READ | BSNL శాటిలైట్ ఫోన్ రిలీజ్.. ధర రూ. 1.34 లక్షలు.. ఈ ఫోన్ ఎందుకింత స్పెషల్
ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా కొన్ని పరిమిత దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే దీనిని ఫేస్‌బుక్‌కు కూడా తీసురానున్నారు. .
ఈ ఫీచర్‌ను ఎలా ఆఫ్ చేయాలి
మీరు పబ్లిక్ అకౌంట్ వాడుతుంటే, వెంటనే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
*మొదట మీ ఇన్‌స్టాగ్రామ్ Profile Settings ఓపెన్ చేయండి.
*అందులో Sharing and Reuse Controls ఆప్షన్‌కి వెళ్ళండి.
*అక్కడ మెటా AI ఫీచర్లతో ఇతరులు మీ కంటెంట్‌ను ఉపయోగించుకునే ఆప్షన్‌ను Disable చేయండి.
ఈ సెట్టింగ్ దానంతట అదే మళ్లీ ఆన్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కాబట్టి, మీ అకౌంట్‌ను 'Private'గా మార్చుకోవడం అత్యంత సురక్షితమైన మార్గం. లేదా అప్పుడప్పుడు ఈ సెట్టింగ్‌ని చెక్ చేసుకుంటూ ఉండండి.
