మూడు దశాబ్దాలుగా భారతదేశ ఇంజినీర్లు ప్రపంచ సాంకేతిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మన ఐటీ సంస్థలు విదేశీ కంపెనీలకు ఎన్నో సేవలు అందిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో పరిస్థితులు మారుతున్నాయి.
గతంలో మనుషులు చేసే చాలా పనులను ఏఐ సులభంగా చేయగలుగుతున్నది. ఈ నేపథ్యంలో భారత్ తన ప్రగతిపథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల కోసం పనిచేయడానికే పరిమితం కాకుండా.. ప్రపంచమంతా ఉపయోగించే సాంకేతికతను మనమే తయారుచేయాలి.
ఏఐ ఎంత శక్తిమంతంగా ఉందన్నదే కాదు.. దాన్ని ఎంత సురక్షితంగా వాడుకోగలమన్నదీ ముఖ్యం. ఉదాహరణకు బ్యాంకులో ఏఐ ఒకరికి డబ్బులు పంపా లనుకుంటే.. ఆ పనిచేసే అధికారం దానికి ఉందా? కస్టమర్ల వివరాలు చూసేందుకు అనుమతి ఉందా? పరిమితి దాటితే దాన్ని ఎవరు ఆపాలి? తప్పు జరిగితే బాధ్యత ఎవరిది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఉండాలి. బ్యాంకులే కాదు.. ఆసుపత్రులు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ జాగ్రత్తలు అవసరం.
ఏఐ చేసే పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థలు ఉండాలి. ఏ పని చేయవచ్చు? ఏది చేయకూడదు? ఎప్పుడు మనుషుల అనుమతి తీసుకోవాలి? తప్పు జరిగే ప్రమాదం ఉంటే ఎలా ఆపాలి? అనే విషయాలపై స్పష్టమైన నియమాలు ఉండాలి. ఈ విధానాన్నే ‘ట్రస్ట్ఆప్స్’ అంటారు. అంటే ఏఐను గుడ్డిగా నమ్మకుండా.. అది చేసే పనులను పర్యవేక్షిస్తూ, సురక్షితంగా ఉపయోగించడం. ఇలాంటి వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో భారత్కు మంచి అవకాశం ఉంది.
ఏఐ భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేయాలి
ఏఐ రంగంలో స్వదేశీ సామర్థ్యం పెరగడం కూడా ముఖ్యం. దేశంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడమే స్వదేశీ ఏఐ కాదు. మన కీలక సమాచారం ఎక్కడ ఉంటుంది? దాన్ని ఎవరు ఉపయోగిస్తారు? ఏఐ ఏ నిర్ణయాలు తీసుకుంటుంది? ఒకవేళ తప్పు జరిగితే దాన్ని ఎవరు పరిశీలిస్తారు? వీటిపై మనకు నియంత్రణ ఉండాలి. మన అవసరాలకు తగిన ఏఐ భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. అవి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఉపయోగపడేలా తయారు చేయాలి. ఇలా చేస్తే విదేశీ కంపెనీలపై ఆధారపడటం తగ్గుతుంది. మన సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి.
సమస్యలను పరిష్కరించే ఇంజినీర్లు కావాలి
ఏఐ రంగంలో ఇంజినీర్ల పని కేవలం సాఫ్ట్వేర్ రాయడానికే పరిమితం కాకూడదు. బ్యాంకులు, ఆసుపత్రులు, పరిశ్రమల్లో ఉన్న సమస్యలను నేరుగా అర్థం చేసుకోవాలి. వాటికి ఏఐతో పరిష్కారాలు చూపాలి. ఆ పరిష్కారాల వల్ల ఎంత సమయం ఆదా అయింది ? ఎంత ఖర్చు తగ్గింది? ఎన్ని తప్పులు తగ్గాయి? అనేది కొలవాలి. ఉదాహరణకు, ఒక ఆసుపత్రిలో రోగుల వివరాలను సురక్షితంగా నిర్వహించేందుకు ఒక కొత్త వ్యవస్థను తయారు చేశారనుకుందాం.
దాన్ని అదే ఆసుపత్రికే పరిమితం చేయకుండా.. మరో వంద ఆసుపత్రులు ఉపయోగించుకునేలా అభివృద్ధి చేయాలి. అప్పుడే ఒక ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవం కొత్త ఉత్పత్తిగా మారుతుంది. ఇందుకోసం ఇంజినీర్లు, వైద్యులు, బ్యాంకు అధికారులు, భద్రతా నిపుణులతో కలిసి పనిచేయాలి. సమస్యను పరిష్కరించడంతోపాటు, ఆ పరిష్కారాన్ని అందరూ ఉపయోగించుకునే ఉత్పత్తిగా మార్చడంపై దృష్టి పెట్టాలి.
సేవల నుంచి ఉత్పత్తుల వైపు..
భారత ఐటీ సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా పనిచేసిన అనుభవం ఉంది. వివిధ రంగాల్లో సమస్యలను పరిష్కరించిన నైపుణ్యం ఉంది. ఈ అనుభవాన్ని కొత్త ఉత్పత్తుల తయారీకి ఉపయోగించుకోవాలి. ఒకే రకమైన పనిని వేర్వేరు కంపెనీల కోసం మళ్లీ మళ్లీ చేయడానికే పరిమితం కాకుండా.. అనేక సంస్థలు ఉపయోగించగల సొంత సాంకేతికతను సృష్టించాలి.
ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. సేవల రంగాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. ఆ రంగంలో సంపాదించిన అనుభవాన్ని కొత్త ఉత్పత్తుల నిర్మాణానికి పునాదిగా మార్చాలి. భారత్ ఎంతమంది ఇంజినీర్లకు ఉద్యోగాలు కల్పించిందన్నదే ఇకపై విజయానికి కొలమానం కాకూడదు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భారతీయ ఏఐ ఉత్పత్తులు ఉపయోగంలో ఉన్నాయి ? అవి ఎంతఖర్చు తగ్గిస్తున్నాయి ? ఎన్ని ప్రమాదాలను నివారిస్తున్నాయి ? వాటిపై వినియోగదారులకు ఎంత నమ్మకం ఉంది ? అన్నదీ చూడాలి. గతంలో ఈ దిశగా ముందడుగు వేయలేకపోయామని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. రాబోయే రెండు దశాబ్దాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ప్రభుత్వాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలు కలిసి పనిచేయాలి. ప్రపంచానికి ఇంజినీర్లను అందించిన భారత్.. ప్రపంచం నమ్మకంగా ఉపయోగించగల ఏఐ సాంకేతికతను సృష్టించే స్థాయికి ఎదగాలి.
ప్రభుత్వం, పెట్టుబడిదారులు సహకరించాలి
ఈ మార్పు ఒక్క ఐటీ కంపెనీలతోనే సాధ్యం కాదు. ప్రభుత్వాలు, పెట్టుబడిదారులతోపాటు విద్యాసంస్థలు కూడా కలిసి పనిచేయాలి. ఏఐ భద్రతను పరీక్షించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులు, బ్యాంకులు, ఇతర సేవల్లో కొత్త సాంకేతికతను పరీక్షించే అవకాశం కల్పించాలి. పరీక్షల్లో సురక్షితమని తేలిన దేశీయ ఉత్పత్తులను ప్రభుత్వ శాఖలు ఉపయోగించాలి. అప్పుడు కొత్త ఉత్పత్తులకు తొలి వినియోగదారులు లభిస్తారు.
పెట్టుబడిదారులు కూడా వెంటనే లాభాలు వచ్చే వ్యాపారాలపైనే కాకుండా, కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసే సంస్థలపై దృష్టి పెట్టాలి. వాటి ఉత్పత్తులు ఇతర దేశాల్లోనూ ఉపయోగపడతాయా ? వినియోగదారులు వాటిని మళ్లీ మళ్లీ వాడుతున్నారా ? అన్నది చూడాలి. విద్యా సంస్థలు విద్యార్థులకు పుస్తకాలలోని పాఠాలతోపాటు నిజ జీవిత సమస్యలను పరిష్కరించే శిక్షణ ఇవ్వాలి. ఏఐ తయారీతోపాటు డేటా భద్రత, బాధ్యతాయుత వినియోగంపై అవగాహన కల్పించాలి.
శ్రీనివాస్ పల్లె, ఏఐ ఎక్స్పర్ట్
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ [email protected]
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
