ఇకపై పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడు సాధారణ పెట్రోల్‌తో పాటు E10, E20 అనే పేర్లు కూడా కనిపించే అవకాశం ఉంది. దీంతో చాలామంది వాహనదారుల్లో సందేహాలు మొదలయ్యాయి. అసలు E10 అంటే ఏమిటి? E20 అంటే ఏమిటి? ఏ వాహనానికి ఏ పెట్రోల్ వాడాలి? ఇంజిన్‌కు ఏమైనా నష్టం జరుగుతుందా? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం భారత్ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. సో దీనిపై క్లారిటీ చాలా ముఖ్యం..
E10, E20 అంటే ఇదే..
పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ శాతాన్ని బట్టి ఈ పేర్లు వస్తాయి. E10లో 10 శాతం ఇథనాల్, 90 శాతం పెట్రోల్ ఉంటుంది. అదే E20లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలుపుతారు. ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. దీనివల్ల క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు రైతులకు కూడా అదనపు ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఎందుకు E20పైనే ఫోకస్?
E20 ఇంధనం వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఇంజిన్ పనితీరు మెరుగుపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అధిక ఆక్టేన్ విలువ, మెరుగైన కంబషన్, స్మూత్ యాక్సిలరేషన్ వంటి ప్రయోజనాలు ఉంటాయని అంటోంది. అలాగే దేశంలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టినందున ఈ విధానాన్ని కొనసాగించడం అవసరమని మోడీ ప్రభుత్వం వివరిస్తోంది.
మైలేజ్ తగ్గుతుందా?
E20 వాడితే కొన్ని వాహనాల్లో మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. సాధారణంగా 3 నుంచి 5 శాతం వరకు ఇంధన సామర్థ్యం తగ్గవచ్చని తెలిపింది. అయితే ఇది అన్ని వాహనాలకు వర్తించదని, మైలేజ్ తగ్గినా కాలుష్యం తగ్గడం, ఇంధన భద్రత పెరగడం వంటి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని కేంద్రం అంటోంది.
పాత వాహనాలకు సమస్యేనా?
2023 ఏప్రిల్‌కు ముందు తయారైన వాహనాల్లో చాలా వరకు E10ను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి. అందుకే ప్రతిపక్షాలు, కొందరు నిపుణులు E10 పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలని కోరుతున్నాయి. అయితే మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్ నిర్వహించిన ఫీల్డ్ పరీక్షల్లో E20 వాడిన వాహనాల్లో ఇంజిన్ దెబ్బతినడం, అసాధారణ తుప్పు సమస్యలు కనిపించలేదని మోడీ ప్రభుత్వం చెబుతోంది.
3 రకాల పెట్రోల్ ఎందుకు అమ్మరు?
ప్యూర్ పెట్రోల్, E10, E20లను ఒకేసారి దేశవ్యాప్తంగా నిల్వ చేసి సరఫరా చేయడం చాలా క్లిష్టమని కేంద్రం చెబుతోంది. లక్షకు పైగా పెట్రోల్ బంకులు, రిఫైనరీలు, డిపోలు, పైప్‌లైన్ వ్యవస్థల్లో 3 రకాల ఇంధనాలను వేర్వేరుగా నిర్వహించడం వల్ల భారీ ఖర్చు, సరఫరా సమస్యలు వస్తాయంటోంది మోడీ ప్రభుత్వం.
మరి వాహనదారులు ఏం చేయాలి?
మీ వాహనం యూజన్ మాన్యువల్‌లో సూచించిన ఇంధన రకాన్ని ఒకసారి తప్పకుండా చెక్ చేస్కోండి. కొత్త వాహనాల్లో ఎక్కువగా E20 అనుకూల ఇంజిన్లు వస్తున్నాయి. పాత వాహనాల యజమానులు తయారీ సంస్థ సూచనలను పాటిస్తేనే వెహికల్ సేఫ్. మొత్తంగా పెట్రోల్ వెరియంట్ల మార్పు ప్రజలకు ముఖ్యంగా పాత వాహనాలు కలిగి ఉన్న వారికి కష్టాలను తెచ్చిపెడుతోంది.
