ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం డ్రామాలు.. కిషన్‌ రెడ్డికి 6 నెలలుగా మేం చేస్తున్న విజ్ఞప్తులు తెలియదా:ఎంపీ వంశీకృష్ణ

ధాన్యం కొనుగోళ్లపై  కేంద్రం డ్రామాలు.. కిషన్‌ రెడ్డికి 6 నెలలుగా మేం చేస్తున్న విజ్ఞప్తులు తెలియదా:ఎంపీ వంశీకృష్ణ
  • వడ్ల దిగుబడి పెరిగిందని ఒప్పుకుంటూనే రాష్ట్రంపై నిందలేయడం ఏంటని నిలదీత
  • వ్యవస్థలను నడపడం చేతగాని బీజేపీ..  ఆర్ఎఫ్‌సీఎల్‌ను తిరోగమనంలో నడిపిస్తోందని విమర్శ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ డ్రామాలేందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిదీశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ధాన్యం సేకరణలో రాష్ట్ర వైఫల్యం కారణంగా రైతులు నష్టపోయారని చెప్తున్న కిషన్ రెడ్డి, మరోవైపు యాసంగి టార్గెట్‌ను పెంచాలని కేంద్రాన్ని కోరారని గుర్తు చేశారు.  

అంటే రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిందని ఆయనే స్వయంగా అంగీకరించారని అన్నారు. మరీ గత ఆరు నెలలుగా పదే పదే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ గా తాను, పార్టీ ఇతర నేతలు.. యాసంగి వడ్ల సేకరణ టార్గెట్ పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) సరిగా కొనుగోలు చేయడం లేదని, తెలంగాణ రైతుల్ని ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తున్నారని  కేంద్రాన్ని అడిగినా స్పందించలేదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌‌కు వ్యవస్థలను నడపడం చేతకావడం లేదని విమర్శించారు. 

కేంద్ర మంత్రిగా గడ్డం వెంకట స్వామి (కాకా), ఎంపీగా వివేక్‌లు దాదాపు రూ.10 వేల కోట్లు మాఫీ చేసి.. పునరుద్ధరించిన రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్(ఆర్ఎఫ్‌సీఎల్)ను మోదీ సర్కార్ తిరోగమనంలో నడిపిస్తోందన్నారు. రాష్ట్ర రైతులకు కీలకమైన ఈ ఎరువుల ఫ్యాక్టరీలో అత్యధికంగా 70 శాతానికి మించి అవుట్‌పుట్ రావడం లేదన్నారు. మిస్ మేనేజ్‌మెంట్ విధానాలతో తెలంగాణ రైతులకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ నష్టం చేస్తోందని మండిపడ్డారు.

 రాముడి పేరుతో ఓట్లను దొంగలించిన బీజేపీ.. ఇప్పుడు నేరుగా హుండీని లూటీ చేస్తోందని ఆరోపించారు. రామ మందిరం విరాళాల్లో సుమారు రూ. 250 కోట్ల స్కాం చేసిందని విమర్శించారు.