- 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడమే లక్ష్యం
- రాజకీయ జోక్యం లేకుండా పీపీపీ మోడల్‌లో యూనివర్సిటీ నిర్వహణ
- యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: చదువుతో నిమిత్తం లేకుండా గ్లోబల్ మెడల్స్ సాధించిన అథ్లెట్లకు నేరుగా గ్రూప్-1 ఉద్యోగాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని శుక్రవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, అద్భుతమైన బాక్సర్ నిఖత్ జరీన్‌లకు వారి విద్యా అర్హతలతో సంబంధం లేకుండా నిబంధనలను సడలించి, కేబినెట్ ప్రత్యేక ఆమోదంతో నేరుగా గ్రూప్-1 స్థాయి డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
పారా ఒలింపిక్స్‌లో దీప్తికి గ్రూప్-2 ఉద్యోగాన్ని కల్పించామని, షూటర్ ఈషా సింగ్‌ను కూడా త్వరలోనే సముచిత రీతిలో సత్కరిస్తామని హామీ ఇచ్చారు. కేవలం చదువు మాత్రమే కాకుండా క్రీడల్లో రాణించినా తమ భవిష్యత్తుకు పూర్తి భరోసా లభిస్తుందనే నమ్మకాన్ని యువతలో కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రీడా విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా రాజకీయ జోక్యం లేని పద్ధతిలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ప్రభుత్వం ఒక మార్గదర్శిగా, అవసరమైన సదుపాయాలు కల్పించే సహాయకారిగా మాత్రమే వ్యవహరిస్తుందని, దీని రోజువారీ నిర్వహణ, నిర్ణయాధికారాల్లో రాజకీయ నాయకుల జోక్యం అస్సలు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ క్రీడా వర్సిటీ పాలక మండలిలో సంజీవ్ గోయెంకా, అభినవ్ బింద్రా, కపిల్ దేవ్, రవికాంత్ రెడ్డి, శశి, ఉపాసన కొణిదెల, కావ్య మారన్ వంటి దేశవ్యాప్తంగా క్రీడలు సహా వివిధ రంగాలలో ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖులను డైరెక్టర్లుగా భాగస్వామ్యులుగా నియమించినట్లు తెలిపారు. క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, అత్యుత్తమ శిక్షణ అందించే పూర్తి బాధ్యతను ఈ బోర్డుకు అప్పగించినట్లు వివరించారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ నడిపిన ‘యంగ్ ఇండియా’ పత్రిక స్ఫూర్తితోనే ఈ అకాడమీలను గ్లోబల్ బ్రాండ్‌గా మారుస్తామని సీఎం తెలిపారు.
త్వరలోనే సమగ్ర క్రీడా విధానం
గత పన్నెండేళ్లుగా రాష్ట్రంలో సరైన క్రీడా విధానం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2003 కాలంలో అఫ్రో-ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీలకు వేదికై ప్రపంచం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్, కాలక్రమేణ ఆ క్రీడా వైభవాన్ని పూర్తిగా కోల్పోయిందన్నారు. గత పాలకులు నిర్మించిన అద్భుతమైన క్రీడా మౌలిక సదుపాయాలను కేవలం పెళ్లిళ్లకు, రాజకీయ సభలకు ఇతర వ్యాపార కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేస్తూ క్రీడలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఈ దుస్థితిని మార్చేందుకే ఒక సమగ్రమైన నూతన క్రీడా విధానాన్ని త్వరలోనే తీసుకురాబోతున్నామని, క్రీడాకారులను గ్లోబల్ చాంపియన్లుగా ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
భారత్‌కు ఒలింపిక్స్‌లో భారీగా పతకాలు రావాలి
భారతదేశం 2036 ఒలింపిక్ క్రీడల ఆతిథ్యం కోసం బిడ్ దాఖలు చేయాలని యోచిస్తున్న తరుణంలో, హైదరాబాద్‌ను ప్రధాన వేదికగా సిద్ధం చేయడమే తమ తదుపరి లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం గచ్చిబౌలి పరిధిలో 82 ఎకరాల సుశాలమైన స్థలంలో ప్రపంచ స్థాయి క్రీడా అకాడమీ, విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే 2028 డిసెంబర్ నాటికి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అన్ని హంగులతో పూర్తి చేసి స్వయంగా తానే ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.
ఒలింపిక్స్‌లో భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే ధ్యేయంగా యువతకు అత్యుత్తమ మౌలిక వసతులు, అంతర్జాతీయ స్థాయి కోచ్‌ల పర్యవేక్షణలో అత్యున్నత శిక్షణ అందించేలా ఈ వేదికను తీర్చిదిద్దుతామన్నారు. క్రీడల్లో ఒక ఓటమి విజయానికి ముగింపు కాదని, దాన్ని సవాల్‌గా తీసుకుని ముందుకు సాగాలన్నారు. క్రీడల్లో అత్యంత ఏకాగ్రతతో, కఠిన శ్రమతో కష్టపడితేనే అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరన్నారు.
