హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు స్టీల్, సిమెంట్ ధరలను తగ్గించాలని ఆయా కంపెనీల ప్రతినిధులను హౌసింగ్, ఇండస్ట్రీస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు కోరారు. ఈ ప్రతిష్టాత్మక స్కీమ్ లో భాగస్వామ్యులు కావాలని కంపెనీలకు మంత్రులు సూచించారు. గురువారం సెక్రటెరియెట్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్, నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా, పరిశ్రమల సహకారం అంశాలపై ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని.. పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత, ఆత్మగౌరవాన్ని కల్పించే మహాయజ్ఞమని అన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసి పనిచేస్తే తెలంగాణలో గుడిసెలు లేని రాష్ట్రం లక్ష్యాన్ని త్వరితగతిన సాధించవచ్చని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రతి వర్గం సహకారం అందించాలని మంత్రులు పిలుపునిచ్చారు. పేదవాడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయమందిస్తే పరిశ్రమల యాజమాన్యాలను కూడా చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారని అన్నారు.
