పారిస్: ప్రపంచంలోనే అతిపెద్ద ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ (ఈడబ్ల్యూసీ) తొలి అంతర్జాతీయ ఎడిషన్ గురువారం పారిస్ ఎక్స్‌పో పోర్ట్ డి వెర్సైల్స్‌లో ప్రారంభమైంది. ఆగస్టు 23 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో 100కుపైగా దేశాలకు చెందిన 2 వేల మందికిపైగా అగ్రశ్రేణి గేమర్లు, 200 ప్రముఖ ఈస్పోర్ట్స్ క్లబ్‌లు పాల్గొంటున్నాయి. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన 24 గేమ్స్‌లో 25 టోర్నీలు నిర్వహించనున్నారు. టోర్నీకి రికార్డు స్థాయిలో 75 మిలియన్ డాలర్లు (సుమారు రూ.716 కోట్లు) ప్రైజ్‌మనీ ప్రకటించారు.
ఇందులో క్లబ్ చాంపియన్‌షిప్‌కే 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ.286 కోట్లు) కేటాయించారు. ఈ టోర్నీ కోసం నిర్వహించిన 330 క్వాలిఫయింగ్ పోటీల్లో 15 లక్షలకుపైగా గేమర్లు పోటీపడ్డారు. ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సెన్ ఈసారి కూడా ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ గ్లోబల్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ ఫౌండేషన్ సీఈవో రాల్ఫ్ రీచర్ట్ మాట్లాడుతూ.. వ్యక్తిగత ప్రతిభతో పాటు క్లబ్ స్థాయి ప్రదర్శనకు ఈ టోర్నీలో ప్రాధాన్యం ఉంటుందన్నారు.
